ఆ రెండు జిల్లాల వైసీపీ ఎమ్మెల్యేలు ఫిక్స్‌!

  • Published By: sreehari ,Published On : January 4, 2020 / 10:06 AM IST
ఆ రెండు జిల్లాల వైసీపీ ఎమ్మెల్యేలు ఫిక్స్‌!

Updated On : January 4, 2020 / 10:06 AM IST

అమరావతి ప్రాంతంలో భావోద్వేగాలు పెరుగుతున్నాయి. రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. మూడు రాజధానుల ప్రకటన వెలువడిన నాటి నుంచి పార్టీల్లో కూడా రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా రాజధాని పరిధిలోని నియోజకవర్గాల అధికార పార్టీ ఎమ్మెల్యేలకు కత్తి మీద సాములా మారింది. పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకించలేక, అలా అని రైతులు చేస్తున్నది తప్పు అని చెప్పలేక నలిగిపోతున్నారట. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల అనుచరులు, పార్టీకి ఓటేసిన వారు ఎమ్మెల్యేలను ప్రశ్నిస్తున్నారట. ఎమ్మెల్యేలు వారి ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నారని చెబుతున్నారు. కానీ, సీఎం జగన్‌ ఎదుట మాత్రం ధీమా వ్యక్తం చేస్తున్నారట.

జనాల ఆలోచన మరోలా :
ఈ వ్యవహారం తమకు రాజకీయంగా నష్టం తెచ్చిపెడుతుందన్న ఆందోళనలో ఉన్నా కూడా అధికార పార్టీలో ఉండడంతో నోరు మెదపడం లేదు. ఈ పరిస్థితుల్లో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మీడియా ముందుకొచ్చి చాలా సేపు చాలా విషయాలు మాట్లాడారు. అప్పటి ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోశారు. సవాళ్లు విసిరారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందని మళ్లీ పాత విషయాలనే చెప్పారు. టీడీపీ నేతల విమర్శలకు కౌంటర్లు ఇచ్చే ప్రయత్నాలు చేశారు. కానీ, ఈ విషయంలో జనాల ఆలోచన మరోలా ఉందంటున్నారు. మీడియా ముందుకొచ్చి మాట్లాడిన విషయాలు బాగానే ఉన్నాయి గానీ.. ఓసారి జనంలోకి వచ్చి చూస్తే బయట పరిస్థితులు ఎంత తీవ్రంగా ఉన్నాయో తెలుస్తుందని కార్యకర్తలు చెవులు కొరుక్కుంటున్నారు.

మూడు రాజధానుల విషయంలో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలో చిచ్చు రేపింది. మూడు ప్రాంతాల నేతలు మూడు రకాలుగా మాట్లాడుతున్నారు. కానీ, చాలా వరకూ ఇప్పుడు సైలెంట్‌గానే ఉంటున్నారు. అధినేత చంద్రబాబు రాజధాని ప్రాంత రైతులకు సంఘీభావంగా ఆందోళనల్లో పాల్గొన్నారు. అప్పటి నుంచి అధికార వైసీపీ జోరు పెంచింది. చంద్రబాబు, భువనేశ్వరి, లోకేశ్‌తో పాటు తెలుగుదేశం పార్టీ నేతలపై ఎదురు దాడి మొదలుపెట్టాయి. కానీ, రాజధాని తరలింపు అంశం మాత్రం కోస్తా జిల్లాల్లోని అధికార పార్టీ ఎమ్మెల్యేలలో ఆందోళన మాత్రం కొనసాగుతోంది. పార్టీ పరంగా బయటకు చెప్పుకోలేకపోతున్నారట.

అగ్రనేతల ఒత్తిడితో :
అమరావతి ప్రాంత రైతులు ప్రారంభించిన ఉద్యమం మెల్లమెల్లగా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకూ కూడా విస్తరిస్తోంది. కోస్తాలో కృష్ణా, గుంటూరు జిల్లాలతోపాటు తూర్పు, పశ్చిమగోదావరి, ప్రకాశం జిల్లాలకు కూడా పాకింది. రైతుల ఆందోళనను నిజానికి వైసీపీ ఎమ్మెల్యేలు లైట్‌గా తీసుకున్నారట. ఈ విషయంలో మొదటిసారి నరసారావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి బహిరంగంగానే పరిపాలన ఒకేచోట ఉండాలని నోరు విప్పారు. కాకపోతే అగ్రనేతల ఒత్తిడితో ఆ ప్రకటన ఉపసంహరించుకున్నారట. అయినా కూడా ఆ ఒక్క ప్రకటనతో వైసీపీ ఎమ్మెల్యేల్లో అంతర్లీనంగా ఉన్నదేంటో తెలిసిపోయిందని జనాలు అంటున్నారు.

రాజకీయంగా ఇబ్బందేనని ఫిక్స్ :
అమరావతి ప్రాంత గ్రామాల్లో విస్తరించి ఉన్న నియోజకవర్గాల ఎమ్మెల్యేలు.. తమకు భవిష్యత్తులో రాజకీయంగా ఇబ్బందేనని ఫిక్సయిపోయారట. రాజకీయ భవిష్యత్తు కూడా అనుమానాస్పదమే అనుకుంటున్నారు. ముఖ్యంగా కృష్ణా, గుంటూరు జిల్లాల్లో రాజకీయ సెగ ఎక్కువైందట. తమ నియోజకవర్గ ఎమ్మెల్యేల వద్దకు అధికార పార్టీకి చెందిన కార్యకర్తలే వెళ్లి.. ప్రభుత్వ నిర్ణయం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. ఇదంతా ఇప్పుడు ఎమ్మెల్యేలకు తలనొప్పిగా మారిందంటున్నారు. కానీ, అధినేత జగన్‌తో చెప్పుకోలేకపోతున్నారట. కొందరు ఎమ్మెల్యేలు మాత్రం సజ్జల రామకృష్ణారెడ్డి వద్ద నియోజకవర్గాల్లో ఆందోళనలు పెరిగాయనీ, తాము ఇబ్బందులు ఎదుర్కొంటున్నామనీ చెప్పారట.

ఇప్పటి వరకూ రైతుల సమస్యగా ఉన్నప్పటికీ ఇప్పుడిప్పుడే ప్రజలు కూడా ఇందులో పాల్గొంటున్నారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో భవిష్యత్‌లో రాజకీయంగా తమకు నష్టమేననీ, రాజధానిని తరలించుకుపోతున్నారనే ఆవేదన ప్రజల్లో కనిపిస్తోందని ఎమ్మెల్యేలు అంతర్గత చర్చల్లో అంటున్నారట. కోస్తాంధ్ర ప్రజలు రోడ్డుకు మీదకు రారని, టైమ్‌ చూసి వాత పెడతారని పార్టీ పెద్దల ముందు ఎమ్మెల్యేలు తమ ఆందోళన వ్యక్తం చేస్తున్నారట. మొత్తం మీద ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఈ రెండు జిల్లాల్లో వైసీపీ నేతల్లో లోలోపల ఆందోళన ఉన్నా బయటకు మాత్రం గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారని జనాలు అనుకుంటున్నారు.