Vijayasai Reddy : విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, వైసీపీ ఎంపీ కీలక నిర్ణయం

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైసీపీ ప్రభుత్వం వ్యతిరేకం అని ఆయన స్పష్టం చేశారు. అంతేకాదు ఈ పార్లమెంటు సమావేశాల్లో

Vijayasai Reddy : విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, వైసీపీ ఎంపీ కీలక నిర్ణయం

Vijayasai Reddy On Steel Plant

Updated On : July 14, 2021 / 6:44 PM IST

Vijayasai Reddy On Steel Plant : విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైసీపీ ప్రభుత్వం వ్యతిరేకం అని ఆయన స్పష్టం చేశారు. అంతేకాదు ఈ పార్లమెంటు సమావేశాల్లో విశాఖ స్టీల్ ప్లాంటు అంశాన్ని లేవనెత్తుతామని… ప్లాంటును ప్రైవేటు పరం చేయకుండా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని చెప్పారు. వచ్చే నెలలో ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికులు చేపట్టబోయే నిరసనలకు తాము మద్దతిస్తామని తెలిపారు.

విపక్ష నేతల మద్దతును కూడా కూడగట్టి పార్లమెంటులో తమ గళాన్ని వినిపిస్తామని విజయసాయిరెడ్డి చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంటును ప్రైవేటు పరం చేయడానికి వైసీపీ ప్రభుత్వం వ్యతిరేకమని… అందుకే ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం కూడా చేశామని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేయడం సరికాదని చెప్పారు. నష్టాల్లో ఉన్న ప్రభుత్వ సంస్థలను లాభాల్లోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. వైజాగ్ ప్లాంటుకు ఉన్న రుణాలను ఈక్విటీగా మార్చాలని చెప్పారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు బొగ్గు గనులను కేటాయిస్తే, ఖర్చులు బాగా తగ్గుతాయని అన్నారు.

స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని మంత్రి అవంతి శ్రీనివాస్ మండిపడ్డారు. రూ.4లక్షల కోట్ల విలువైన భూమిని ప్రైవేట్‌కు కట్టబెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. ప్రైవేటీకరణపై సీఎం జగన్ కేంద్రానికి రెండుసార్లు లేఖ రాశారని మంత్రి గుర్తు చేశారు. ప్రజల అభిప్రాయానికి వ్యతిరేకంగా ఏ నిర్ణయం తీసుకున్నా.. పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. పార్లమెంట్‌లో స్టీల్‌ ప్లాంట్‌కు ప్రైవేటీకర్ణకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని అవంతి శ్రీనివాస్ ప్రకటించారు.

ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి అవంతి శ్రీనివాస్‌తో ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నేతలు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టబోయే భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పార్లమెంట్‌లో పోరాటం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. బీజేపీ మినహా అన్ని పార్టీల సహకారం తీసుకోవాలని, ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర రెండు రోజులు ఆందోళన చేయాలని నిర్ణయించారు.