శుభాంజలి పేరుతో గుండు కొట్టేశాడు : చిట్టీలతో రూ.100 కోట్లు మోసం
హైదరాబాద్: నగరంలో రిషభ్ చిట్ ఫండ్ మోసం మర్చిపోక ముందే మరో చిట్ ఫండ్ కంపెనీ ఖాతాదారులను 100కోట్లకు ముంచింది. శుభాంజలి చిట్ ఫండ్ పేరుతో ఆంధ్ర, తెలంగాణాలలో వందలాదిమందిని రూ.100 కోట్ల మేర ముంచాడు సంస్ధ యజమాని తోట హనుమంతరావు. గతంలో చిట్ ఫండ్ కంపెనీలో పని చేసిన అనుభవంతో ఎల్లారెడ్డిగూడలో శుభాంజలి సంస్ధను ప్రారంభించాడు హనుమంతరావు. రిజిస్ట్రార్ ఇచ్చిన నెంబరుతో 3,4 చిట్టీలు నిర్వహించేవాడు. ఒక వ్యక్తి దగ్గర కోటి రూపాయలు చిట్ వేయించుకుని.. అతడి పేరుతో మరో సంస్థలో 10 లక్షల చిట్ వేసేవాడు. ఆ రిజిష్ట్రేషన్ నెంబరు కస్టమర్ కి ఇచ్చి, తానే రిజిస్ట్రేషన్ చేసి సంస్ధను నడుపుతున్నట్లు నమ్మించేవాడు. ఒక్కో చిట్ కు 32శాతం కమీషన్ తీసుకునేవాడు. చీటి సొమ్ము చెల్లించటం ఆలస్య అయితే 18శాతం పెనాల్టీ విధించి మరీ వసూలు చేసేవాడు. ఇలా వందలాది మందిని ముంచిన హనుమంతరావు బాధితుల్లో డాక్టర్లు, ఇంజనీర్లు, ప్రభుత్వ ఉద్యోగులు, చిరు వ్యాపారులు, మధ్య తరగతి వారు ఉన్నారు.
పూల వ్యాపారం చేసే ఒక వ్యక్తి రూ.6 లక్షలు చిట్ వేశాడు. విడతల వారీగా మొత్తం చెల్లించినా, చివరికి అతనికి ఇచ్చింది రూ.7 వేలు మాత్రమే. ఇలాంటి బాధితులు వందల్లో ఉన్నారు. తప్పులు కప్పి పుచ్చుకోటానికి చీటీల డబ్బులు ఇవ్వలేదంటూ కొంత మందికి హనుమంతరావు లీగల్ నోటీసులు కూడా పంపించాడు. నోటీసులు అందుకున్న కొందరు బాధితులు చిట్స్ రిజిస్ట్రార్ దగ్గర కేసు ఫైల్ చేశారు. అసలు బాగోతం అప్పుడు బయటపడింది. రిజిస్ట్రార్ దగ్గర ఉన్న రూ.9 కోట్ల రూపాయలు ఫ్రీజ్ అయ్యాయి. జూబ్లీ హిల్స్ కు చెందిన శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి ఇచ్చిన కంప్లయింట్ తో కేసు నమోదు చేసుకున్న పోలీసులు 2019, జనవరి 8వ తేదీన హనుమంతరావును అరెస్టు చేశారు.
హనుమంతుడి లీలలు ఎన్నో
హనుమంతరావు ప్రభుత్వ టీచర్. భార్యను మేనేజర్ గా పరిచయం చేశాడు. కొన్నేళ్లు నమ్మకంగా డబ్బులు చెల్లించిన ఇతను.. మూడేళ్లుగా డ్రామాలు మొదలుపెట్టాడు. డిపాజిట్ దారులతోపాటు చిట్టీలు పాడుకున్న వారికి డబ్బులు చెల్లించటం లేదు. ఎవరైనా గట్టిగా డబ్బులు అడిగితే.. వారిని బెదిరించేవాడు. రాజకీయ నేతల పేర్లు చెప్పి భయపెట్టేవాడు.
కొంతమంది దగ్గర ఏకంగా రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసు కూడా వాడేశాడు. ఆ కేసులో రేవంత్ కు డబ్బు ఎవరిచ్చారనే విషయంపై విచారణ జరుగుతోంది. నాపై పోలీసుల నిఘా ఉంది. అందుకే తప్పించుకుని తిరుగుతున్నా.. నాకు ఫోన్లు చేస్తే మిమ్మల్ని కూడా విచారణకు పిలుస్తారు అని బెదిరించేవాడు. ఇలా ప్రతి పొలిటికల్ లీడర్ ను, కేసులను వాడేసుకునేవాడు హనుమంతరావు. ఇప్పటి వరకు ప్రాథమికంగా 100 కోట్ల రూపాయల వరకు మోసం చేసినట్లు తేలింది. విచారణ పూర్తిగా చేస్తే ఇంకెన్ని కొట్టేసిన కోట్లు బయటకు వస్తాయో చూడాలి… శుభాంజలి కాదు.. శుభ్రంగా గుండు కొట్టేశాడు అంటూ తిట్టుకుంటున్నారు బాధితులు.