Uttar Pradesh: టూర్‌కు వెళ్తున్న స్కూలు బస్సు బోల్తా… ఇద్దరు విద్యార్థులు మృతి

75 మంది విద్యార్థులతో కలిసి టూర్‌కు వెళ్తున్న స్కూలు బస్సు బోల్తా పడిన ఘటనలో ఇద్దరు విద్యార్థులు మరణించారు. మరికొందరు గాయపడ్డారు. ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది.

Uttar Pradesh: టూర్‌కు వెళ్తున్న స్కూలు బస్సు బోల్తా… ఇద్దరు విద్యార్థులు మృతి

Updated On : December 17, 2022 / 6:26 PM IST

Uttar Pradesh: ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు మరణించారు. విద్యార్థులతో కలిసి టూర్‌కు వెళ్తున్న బస్సు బోల్తా పడటంతో శనివారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జౌన్‌పూర్ పట్టణానికి చెందిన ఒక స్కూళ్లోని 75 మంది విద్యార్థులు ఆనంద్ భవన్ ప్రాంతానికి టూర్ వెళ్లారు.

India vs Bangladesh: ఇండియా-బంగ్లాదేశ్ తొలి టెస్ట్.. ముగిసిన నాలుగో రోజు ఆట.. విజయానికి 4 వికెట్ల దూరంలో భారత్

శనివారం ఉదయం బస్సులో వెళ్తుండగా పక్క నుంచి బైకుపై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు బస్సును ఢీకొనబోయారు. ఈ క్రమంలో వారిని రక్షించేందుకు డ్రైవర్ ప్రయత్నిస్తుండగా, స్టీరింగ్‌పై పట్టు కోల్పోయాడు. దీంతో స్కూలు బస్సు అదుపుతప్పి, బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులు మరణించారు. మరికొందరు విద్యార్థులు గాయపడ్డారు. వెంటనే సమాచారం అందుకున్న సహాయక సిబ్బంది, పోలీసులు రక్షణ చర్యలు చేపట్టారు. క్షతగాత్రుల్ని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన వారిని మరో ప్రధాన ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

మరణించిన విద్యార్థుల్ని అంకిత్ కుమార్ (9వ తరగతి), అనురాగ్ (10వ తరగతి)గా గుర్తించారు. కాగా, ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 75 మంది విద్యార్థులు ఉన్నారు. 40 మంది అబ్బాయిలు, 35 మంది అమ్మాయిలు ఉన్నారు. ఏడుగురు టీచర్లు కూడా ఉన్నారు. బస్సు సీటింగ్ కెపాసిటీ మాత్రం 41.