ఆడవేషంలో పిల్లల్ని కిడ్నాప్ చేయబోయిన వ్యక్తికి దేహశుధ్ధి

beggar trying kidnap girl in the dress of woman : బిచ్చమెత్తుకోటానికి ఆడవేషంలో వచ్చి చిన్నారిని కిడ్నాప్ చేయబోయిన వ్యక్తిని పట్టుకుని దేహశుధ్ది చేసిన సంఘటన మెదక్ రూరల్ జిల్లాలో జరిగింది. మెదక్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అవుసులపల్లి గ్రామానికి చెందిన గంగ, బాలరాజు ఇంటి వద్దకు ఓ వ్యక్తి ఆడవేషధారణలో వచ్చి బియ్యం కావాలని యాచించాడు.
దీంతో ఆ కుటుంబీకులు బియ్యం తీసుకొచ్చేందుకు ఇంట్లోకి వెళ్లిన క్రమంలో ఆరుబయట ఆడుకుంటున్న వారి ఎనిమిదేళ్ల చిన్నారి దివ్యను ఎత్తుకొని కిడ్నాప్‌కు ప్రయత్నించాడు. ఇది గమనించిన చిన్నారి తల్లి కేకలు వేయడంతో అప్రమత్తమైన గ్రామస్తులు నిందితుడిని పట్టుకొని చితకబాదారు.
దేహశుద్ధి చేసిన తర్వాత స్థానిక కార్యాలయ భవనంలో బంధించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయాలతో ఉన్న నిందితుడికి చికిత్స చేయించి రూరల్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పోలీసుల విచారణలో మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం రామాయపల్లి గ్రామానికి చెందిన స్వామిగా గుర్తించారు.
నిందితుడు ప్రైవేటు స్కూల్లో కరాటే టీచర్‌గా పని చేస్తున్నాడని.. మెదక్ ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవించిన వదినను చూసేందుకు రెండు రోజుల క్రితం పట్టణానికి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. డబ్బులు లేకపోవడంతో రెండు రోజులుగా భిక్షాటన చేస్తూ శనివారం ఉదయం అవుసులపల్లి గ్రామానికి మహిళా వేషధారణ దుస్తులు ధరించి వెళ్లినట్లు చెప్పాడు.
బాధితుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించకపోవడం గమనార్హం. కిడ్నాప్ కలకలం సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో చర్చనీయాంశమైంది.