దీపిక కిడ్నాప్ కేసులో పురోగతి.. నిజం తెలిశాక ఊపిరి పీల్చుకున్న పోలీసులు

deepika kidnap case: కలకలం రేపిన వికారాబాద్ దీపిక కిడ్నాప్ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. దీపిక ఆమె భర్త అఖిల్ తో వికారాబాద్ పోలీసులు మాట్లాడారు. ఇష్టపూర్వకంగానే తాను తన భర్త అఖిల్ తో వెళ్లినట్లు దీపిక పోలీసులతో చెప్పింది. దీంతో పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. దీపిక సేఫ్ అని తెలిశాక రిలాక్స్ అయ్యారు. భార్య భర్తలను పోలీసులు ముంబై నుంచి వికారాబాద్ పోలీస్ స్టేషన్ కు తీసుకురానున్నారు.
రోడ్డుపై వెళ్తుండగా భర్త కారులో ఎత్తుకెళ్లారు:
వికారాబాద్‌లో ఆదివారం(సెప్టెంబర్ 27,2020) నడిరోడ్డుపై సినీ ఫక్కీలో దీపికను కిడ్నాప్ చేశారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్న దీపికను ఆమె భర్త కారులో వచ్చిన దుండగులు అదే కారులో ఎత్తుకెళ్లారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. దీపికను ఆమె భర్త అఖిల్ కిడ్నాప్ చేసినట్లు భావించారు. ఆ కోణంలోనే విచారణ చేపట్టారు.
భార్య, భర్తల ఫోన్లు స్విచ్చాఫ్:
దీపిక కేసు సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపించింది. దీపిక కిడ్నాప్‌కు సహకరించిన భర్త అఖిల్ స్నేహితులను పోలీసులు విచారించారు. అఖిల్‌కు సంబంధించిన కారులోనే దీపికను తీసుకెళ్లినట్లు వెల్లడించారు. పెళ్లి అయినప్పటికీ అఖిల్, దీపిక రెండేళ్లుగా దూరంగా ఉంటున్నారని తెలిపారు. దీపిక ఎక్కడుందనే విషయం తెలియదని పోలీసులకు చెప్పారు. ఇక 6 బృందాలుగా విడిపోయిన పోలీసులు దీపిక, అఖిల్ ఆచూకీ కోసం గాలించారు. ఇద్దరి ఫోన్లు స్విచ్చాఫ్‌లో ఉండటంతో పోలీసులకు కొంత ఇబ్బంది కలిగింది.
తల్లిదండ్రులకు చెప్పకుండా 2016లోనే ప్రేమ పెళ్లి:
కిడ్నాప్‌కు గురైన దీపిక, అఖిల్ 2016లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అమ్మాయి తల్లిదండ్రులకు పెళ్లి ఇష్టం లేకపోవడంతో రెండేళ్ల క్రితం అమ్మాయిని తీసుకొచ్చారు. కుటుంబ సభ్యుల బలవంతం మేరకు అఖిల్ నుంచి విడాకులు కోరుతూ దీపిక కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
ఈ క్రమంలోనే శనివారం(సెప్టెంబర్ 26,2020) ఇరువురు వికారాబాద్ కోర్టుకు హాజరయ్యారు. ఇక ఆదివారం సాయంత్రం దీపిక షాపింగ్‌కు వెళ్లి ఇంటికి వెళ్తుండగా.. ఓ కారులో వచ్చిన ముగ్గురు వ్యక్తులు దీపికను బలవంతంగా ఎత్తుకెళ్లారు. దీపిక పక్కనే ఉన్న సోదరిని తోసి వెళ్లిపోయారు. దీంతో దీపిక కుటుంబ సభ్యులు వికారాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.