Digital Arrest: వామ్మో.. డిజిటల్ అరెస్ట్ పేరుతో 80లక్షలు కొట్టేశారు.. హైదరాబాద్ రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి ఇలా మోసపోయారు..

ఎవరికైనా ఇలాంటి బెదిరింపులు వస్తే భయపడకుండా, ఆందోళన చెందకుండా ఉండాలని.. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.

Digital Arrest: వామ్మో.. డిజిటల్ అరెస్ట్ పేరుతో 80లక్షలు కొట్టేశారు.. హైదరాబాద్ రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి ఇలా మోసపోయారు..

Updated On : September 19, 2025 / 6:10 PM IST

Digital Arrest: సైబర్ క్రిమినల్స్ రెచ్చిపోతున్నారు. కొత్త కొత్త పద్ధతుల్లో మోసాలకు పాల్పడుతున్నారు. చదువు రాని వారినే కాదు ఉన్నత విద్యావంతులను సైతం ఈజీగా బురిడీ కొట్టిస్తున్నారు. డిజిటల్ అరెస్ట్ పేరుతో భయపెట్టి లక్షలు, కోట్లు దోచుకుంటున్నారు. సైబర్ మోసాల గురించి పోలీసులు అవగాహన కల్పిస్తున్నా మార్పు రావడం లేదు. డిజిటల్ అరెస్ట్ అనేది నిజం కాదని చైతన్యం కల్పిస్తున్నా.. ఇంకా అనేక మంది మోసపోతూనే ఉన్నారు. తమ అమాయకత్వంతో, లేని పోని భయాలతో డబ్బులు పోగొట్టుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్ లో డిజిలట్ అరెస్ట్ మోసానికి వృద్ధుడు బలయ్యాడు. అతడు ఏకంగా 80 లక్షలు పోగొట్టుకున్నాడు.

హబ్సిగూడలో 83 ఏళ్ల రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి డిజిటల్ అరెస్ట్ మోసానికి గురయ్యాడు. సైబర్ క్రిమినల్స్ అతడికి ఫోన్ చేశారు. తమను తాము TRAI అధికారులుగా, పోలీసులుగా పరిచయం చేసుకున్నారు. మానవ అక్రమ రవాణ కేసులో మీ ఆధార్ కార్డ్ వాడబడింది అంటూ వృద్ధుడిని బెదిరించారు. కంబోడియా, మయన్మార్, ఫిలిప్పీన్స్ దేశాల్లో మానవ అక్రమ రవాణా జరిగిందని నమ్మించారు.

నకిలీ సుప్రీంకోర్టు నోటీసు, ఫేక్ ఏటీఎమ్ కార్డును చూపించారు. డిజిటల్ అరెస్ట్ చేస్తామని బెదిరించారు. అంతే, ఇదంతా నిజమే అనుకుని వృద్ధుడు భయపడిపోయాడు. అరెస్ట్ అనే సరికి అతడికి చెమట్లు పట్టేశాయి. అరెస్ట్ అవ్వకుండా ఉండాలంటే డబ్బులు పంపాలని సైబర్ కేటుగాళ్లు చెప్పారు. వారు చెప్పినట్లు వృద్ధుడు వరుసగా లక్షల రూపాయలు ట్రాన్స్‌ఫర్ చేశాడు. అలా 80 లక్షల 64 వేలు దోచుకున్నారు కేటుగాళ్లు.

ఈ ఘటనపై సైబర్ క్రైమ్ పోలీసులు స్పందించారు. డిజిటల్ అరెస్ట్ అనేది ఎక్కడా ఉండదని తేల్చి చెప్పారు. సైబర్ క్రిమినల్స్ ఉచ్చులో చిక్కుకోవద్దని సూచించారు. ఎవరికైనా ఇలాంటి బెదిరింపులు వస్తే భయపడకుండా, ఆందోళన చెందకుండా ఉండాలని.. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్ కు స్పందించొద్దని, లింకులపై క్లిక్ చేయొద్దని పోలీసులు జాగ్రత్తలు చెప్పారు.

Also Read: రూ.40 కోట్ల భారీ ఆర్థిక మోసం.. అది నిజమే..! మొబిక్విక్ అంగీకారం..