టెర్రరిస్టులతో చేతులు కలిపిన DSP!

జమ్ము కశ్మీర్‌లో DSP దవీందర్ సింగ్ అరెస్ట్ వ్యవహారం సంచలనం కలిగిస్తోంది. ఉగ్రవాదులతో ఏకంగా డీఎస్పీ స్థాయి అధికారులే మిలాఖత్ అవ్వడంతో పోలీస్ శాఖ నివ్వెరపోతోంది. దీంతో భద్రతాదళాలకు అసలు ముప్పు టెర్రరిస్టుల నుంచి కాదని.. ఇలాంటి ఇంటి దొంగల నుంచేనంటూ ఆందోళన వ్యక్తమవుతోంది. కేసు లోతుగా దర్యాప్తు చేస్తే ఇంకెన్ని బ్లాక్ షీప్స్ బైటపడతాయో అనే టెన్షన్ ప్రారంభమైంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న దవీందర్ సింగ్ గతంలో రాష్ట్రపతి మెడల్ అందుకోవడమే అందుకు కారణం.
కాపలా ఉండాల్సిన కంచెను చేను మేస్తే.. బోర్డర్ దగ్గర టెర్రరిస్టులను పట్టుకోవాల్సిన పోలీసులే వారితో ములాఖత్ అయితే ఇదే జరిగింది జమ్ము కశ్మీర్‌లో. వాంటెడ్ టెర్రరిస్టులుగా ఉన్న ఉగ్రవాదులను లోయలోకి భద్రంగా చేర్చుతోన్న దవీందర్ సింగ్ అనే పోలీస్ ఆఫీసర్‌ని మాటు వేసి మరీ పట్టుకున్నారు. దీంతో ఈ సంఘటన పెద్ద సంచలనం కలిగిస్తోంది. దవీందర్ సింగ్‌కి ఈ టెర్రరిస్టులతో ఏం పని.. వారితో ఇతని సంబంధాలు ఏ స్థాయి వరకూ చేరాయి.. ఉగ్రవాదులకు కేవలం దవీందర్ సింగ్ కొరియర్‌గా మాత్రమే పని చేస్తున్నాడా లేక వారి మోచేతి నీళ్లు తాగుతూ ఇంకా దేశద్రోహం చేసే స్థాయి వరకూ వెళ్లాడా అనే విషయాలపై పోలీసులు ఎంక్వైరీ మొదలు పెట్టారు.
ఇతను యాంటీ హైజాకింగ్ విభాగంలో పని చేస్తున్నారు. శ్రీనగర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ఆపరేషనల్ డ్యూటీస్ చేస్తున్నాడు. ఉగ్రవాదులకు సహాయం చేస్తున్నాడన్న విషయం, దవీందర్ సింగ్ వ్యవహారశైలిపై కొన్నాళ్లుగా పోలీస్ శాఖకి డౌట్ వచ్చింది. అందుకే అతని వ్యవహారాలపై నిఘా పెట్టారు పోలీసులు. ఈజీగా తమ ట్రాప్‌లో పడేందుకు దవీందర్ సింగ్ కార్యకలాపాలు సాగేందుకు వీలుగా కొన్ని చోట్ల చెక్ పాయింట్స్ లూజ్ చేశారు.
అలా శనివారం ఖాజీగండ్‌లోని మీర్ బజార్ వద్ద ఐటెన్ కారులో ఇద్దరు టెర్రరిస్టులను తరలిస్తూ దొరికిపోయాడు. అతను మాత్రం ఈ ఇద్దరు ఉగ్రవాదులను లొంగిపోయేందుకు ఒప్పించానంటూ మాటలు చెబుతున్నాడు. అందుకే వారితో కారులో ఉన్నట్లు దవీందర్ సింగ్ నమ్మబలుకుతున్నాడు. దవీందర్ సింగ్ తో పాటు దొరికిన ఇద్దరు టెర్రరిస్టులలో ఒకరు నవీద్ బాబు, మరొకరు రఫీ అహ్మద్. వీరిలో నవీద్ బాబు కూడా గతంలో పోలీస్ శాఖలో పని చేశాడు. బుద్గామ్‌లోని ఫుడ్ అండ్ సప్లయ్ సెక్యూరిటీ వింగ్‌లో 2017 వరకూ నవీద్ బాబు విధులు నిర్వహించాడు. తర్వాత మే 2017లో ఏకే 47 రైఫిల్‌తో పరారైన నవీద్ బాబు హిజ్బుల్ ముజాయిద్ధీన్ ఉగ్రవాదిగా మారిపోయాడు.
నవీద్ బాబు ఒక్కడే ఓ 30మంది టెర్రరిస్టుల గ్రూప్‌ని లీడ్ చేస్తున్నాడని పోలీసులు చెప్తున్నారు. కశ్మీర్ లోయలో కనీసం 12మంది పోలీసుల మరణాలకు ఈ ముఠానే కారణం. అంటే ఓ కరుడుగట్టిన ఉగ్రవాదుల ముఠాతో DSP దవీందర్ సింగ్ చేతులు కలిపినట్లు అర్ధమవుతోంది. ఇప్పుడు తేలాల్సింది దవీందర్ సింగ్ ఎంతమంది ఉగ్రవాదులకు సాయం అందించాడు. ఎంతమందిని దేశం దాటించాడు..అలానే ఇంకా ఎంతమంది పోలీసులు ఉగ్రవాదులకు సహకరిస్తున్నారు ఈ ప్రశ్నలకు సమాధా నాలు తెలిస్తే..పోలీస్ వ్యవస్థతో పాటు నిఘా వ్యవస్థలోని లోపాలు ఏ స్థాయిలో ఉన్నాయో బైటపడుతుంది.
Read More : బంపర్ ఆఫర్ : మెట్రో రైలు ఛార్జీల్లో 50 శాతం రాయితీ