సెల్ఫీ మోజులో జలపాతంలో పడి ఐదుగురి మృతి

సరదా సెల్ఫీ మోజు 5గురి ప్రాణాలను బలిగొంది. సెల్ఫీ మోజులో పడి ఇప్పటికే చాలామంది ప్రాణాలు పోగొట్టుకున్నా సెల్ఫీ తీసుకునే వారు తగిన జాగ్రత్తలు తీసుకోకపోవటంతో ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. మహారాష్ట్రలోని పాల్గర్ జిల్లాలోని కాల్ మాండవి జలపాతం వద్ద ఈ దుర్ఘటన జరిగింది.
పాల్గర్ జిల్లా జవహర్ టౌన్ సమీపంలోని కాల్మండ్వి జలపాతం చూడటానికి 13 మంది సభ్యుల బృందం గురువారం అక్కడకు చేరుకుంది. అందులోని ఇద్దరు వ్యక్తులు సెల్ఫీలు తీసుకునే క్రమంలో కొంచెం నీటి లోపలకు వెళ్ళారు. అప్పటికే అక్కడ నీటి ఉధృతి ఎక్కువగా ఉంది. నీటిలోకి వెళ్లిన వారు ఉధృతి తట్టుకోలేక కిందపడిపోయి నీటిలో కొట్టుకు పోసాగారు.
వారిని రక్షించేందుకు నీటిలోకి దూకిన మరో ముగ్గురు కూడా నీటి ప్రవాహా వేగానికి కొట్టుకుపోయారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఘటనాస్ధలానికి వచ్చి సహాయక చర్యలు చేపట్టి మృతదేహాలను వెలికి తీశాయి. పోస్టు మార్టం నిమిత్తం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు.