భర్తను వెతుకుతూ భాగ్యనగరానికి… భయంతో 100కి ఫోన్ చేసిన మహిళ

తనను వదిలి వెళ్లిపోయిన భర్తను వెతుక్కుంటూ భాగ్యనగరానికి వచ్చిన మహిళను పోలీసులు కాపాడారు. అనంతపురంకు చెందిన లీలావతి(25) అనే మహిళకు అదే ఫ్రాంతానికి చెందిన తులసిరెడ్డితో 2013లో వివాహాం అయ్యింది. కొన్నాళ్లు హ్యాపీగా సాగిన వీరి కాపురంలో కలతలు మొదలయ్యాయి. ఇద్దరి మధ్య మనస్పర్ధలు పెరిగాయి. దీంతో తులసిరెడ్డి లీలావతిని పుట్టింటిలో దింపి ఉద్యోగం పేరుతో చెన్నై వెళ్లాడు.
చెన్నై చేరిన తులసి రెడ్డి ఐసీఐసీఐ బ్యాంకులో ఉద్యోగంలో చేరాడు. భర్త ఎంతకూ ఇంటికి తీసుకువెళ్లకపోవటంతో లీలావతి చెన్నై వెళ్లి తులసి రెడ్డి కోసం విచారించింది. అక్కడ ఐసీఐసీఐ బ్యాంకు సిబ్బంది తులసిరెడ్డి హైదరాబాద్ కి బదిలీ అయి వెళ్ళాడని చెప్పారు.
లీలావతి అక్కడినుంచి డిసెంబర్9న హైదరాబాద్ చేరుకుంది. భర్త కోసం కాచిగూడ పీఎస్ పరిధిలోని నెహ్రూనగర్ వద్ద భర్త కోసం వెతికింది. అక్కడ భర్త ఆచూకి లభించలేదు. కానీ… కర్మన్ ఘాట్ లో ఉంటున్నాడనే విషయం తెలిసింది. అప్పటికి రాత్రి అయ్యింది. రాత్రిపూట హైదరాబాద్ లో ఎటు వెళ్లాలో తెలియక డయల్ 100 కు ఫోన్ చేసింది. వెంటనే స్పందించిన పోలీసులు ఆమె వద్దకు వెళ్లారు. వివరాలు తెలుసుకుని ఆమెను గోల్నాక లోని కమలా నగర్ లోని మహిళా హోం కు క్షేమంగా తరలించారు.