కూతురితో అసభ్యంగా ప్రవర్తించిన తండ్రికి జైలు

ఏ తండ్రి చేయకూడని పని అతడు చేశాడు. కన్నకూతురికి రక్షణగా ఉండాల్సిన అతడే దారితప్పాడు. తప్పుగా ప్రవర్తించి కటకటాలపాలయ్యాడు. ఊచలు లెక్కపెడుతున్నాడు. కూతురితో అసభ్యంగా ప్రవర్తించిన కేసులో ఓ తండ్రికి జైలు శిక్ష పడింది.
వివాహిత అయిన కూతురు(25) పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఓ తండ్రికి మూడేళ్ల జైలు శిక్ష పడింది. రూ.30 వేల జరిమానా కూడా విధించారు. కొత్తగూడెం జిల్లా మూడో అదనపు జ్యుడీషియల్ మొదటి శ్రేణి న్యాయమూర్తి దేవీమానస ఈ తీర్పు ఇచ్చారు.
కేసు వివరాల్లోకి వెళితే.. కొత్తగూడెంకి చెందిన రమేశ్(55) 2016లో పట్టణంలోనే తన కూతురు ఇంటికి వెళ్లాడు. ఆమె ఎలా ఉందో చూడాలని వెళ్లాడు. అయితే భర్త లేని సమయంలో తన ఇంటికి వచ్చిన రమేశ్.. తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని కూతురు ఆరోపించింది. బాధితురాలు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో తండ్రిపై ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేశారు. న్యాయమూర్తి సాక్షులను విచారించిన అనంతరం నిందితుడిపై నేరం రుజువైనట్లు భావించి శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు.
మహిళలు, ఆడపిల్లల రక్షణ కోసం ఎన్ని చట్టాలు తెస్తున్నా, కఠిన శిక్షలు విధిస్తున్నా మృగాళ్లలో మార్పురావడం లేదు. ఇంటి నుంచి బయటికి వెళ్లిన అమ్మాయి తిరిగి సురక్షితంగా ఇంటి వచ్చే వరకు తల్లిదండ్రులు టెన్షన్ పడుతుంటారు. అయితే వీధుల్లోనే కాదు.. సొంత ఇళ్లలోనూ అకృత్యాలు జరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.