అక్రమంగా తరలిస్తున్న కోటి రూపాయలు స్వాధీనం 

  • Published By: chvmurthy ,Published On : February 20, 2019 / 04:08 AM IST
అక్రమంగా తరలిస్తున్న కోటి రూపాయలు స్వాధీనం 

ఒంగోలు : కారులో అక్రమంగా తరలిస్తున్న కోటి రూపాయలను ప్రకాశం జిల్లా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.  కొండెపి నియోజకవర్గంలోని టంగుటూరు టోల్ గేటు వద్ద పక్కా సమాచారంతో పోలీసులు  మంగళవారం సాయంత్రం వలపన్ని నగదును, కారును, స్వాధీనం చేసుకున్నారు. నగదు తరలిస్తున్న ఇద్దరినీ  అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఒంగోలు డీస్పీ రాధేశ్  మురళి  చెప్పిన వివరాల ప్రకారం …. నరసాపురం కు చెందిన జయదేవ్ జ్యూయలర్స్ యజమాని  తన దగ్గర పనిచేసే ఆనందరావు, రాజేష్ అనే వారిని విజయవాడ లోని భాస్కర్ అనే వ్యక్తి దగ్గర కోటి రూపాయల నగదు తీసుకురమ్మని పంపించాడు.  వారు విజయవాడలో నగదు తీసుకున్న తరువాత వీటిని చెన్నై లోని బంగారం కొనే వాళ్లకి అప్పగించాలంటూ యజమాని సూచించాడు.  అక్కడి నుంచి వారు చెన్నై బయలు దేరగా మార్గ మధ్యంలో  యజమాని వారిని ఫోన్ లో సంప్రదించి నెల్లూరులో భాస్కర్ అనే వ్యక్తి ఇవ్వాల్సిందిగా ఆదేశించాడు. ఈ క్రమంలోనే భాస్కర్ ఆనందరావు, రాజేష్ లను సంప్రదించి నెల్లూరు సింహపురి హోటల్ దగ్గరకి వచ్చి తనకి ఫోన్ చేయాల్సిందిగా తెలిపారు.

ఈ మొత్తం విషయమై పోలీస్ లకు పక్క సమాచారం అందడంతో టంగుటూరులోని టోల్ గేట్  వద్ద మాటు వేసి వీరిని అదుపులోకి తీసుకున్నారు. ఐతే ఈ మొత్తం కథలో పోలీస్ లో ఆశ్చర్యపోయే విషయాలు బయటపడ్డాయి. జ్యూయలర్స్ షాపు యజమాని ముందుగానే పక్క ప్లాన్తో నగదుని తరలించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కారణం….  కారుకి వెనుక భాగంలో ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా నగదుని పెట్టుకునేందుకు ఒక సెపరేట్ రాక్ ను వీరు అమర్చుకున్నారు. ఇది ఎవరికీ కనపడదు. దీంతో నగదును చెన్నై చేర్చుదామనుకున్నారు. ఇంతలో వీరిని పోలీస్ లు పట్టుకున్నారు.