IIT అకాడమీ స్టూడెంట్‌‌పై ప్రిన్సిపాల్‌ పిడిగుద్దులు

IIT అకాడమీ స్టూడెంట్‌‌పై ప్రిన్సిపాల్‌ పిడిగుద్దులు

Updated On : October 27, 2019 / 6:46 AM IST

హైదరాబాద్ కూకటపల్లిలోని శ్రీ చైతన్య ఐఐటీ అకాడమీ స్టూడెంట్ కడుపులో పంచ్ విసిరిన ప్రిన్సిపాల్‌పై కేసు నమోదైంది. తన కొడుకుపై దాడి జరిగిందంటూ తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. ఇంటర్మీడియట్‌లో ఎంపీసీ ఫస్ట్ ఇయర్ చదువుతోన్న లోకేశ్ కుమార్ కడుపులో ప్రిన్సిపల్ పిడిగుద్దులు కురిపించాడు. 

శుక్రవారం మధ్యాహ్న సమయంలో స్టూడెంట్ నోట్స్‌ను స్నేహితుడి దగ్గర్నుంచి తీసుకుని కాలేజీ కారిడార్లో క్లాస్ మేట్స్‌తో పాటు చదువుకుంటున్నాడు. అదే సమయంలోనే వచ్చిన ప్రిన్సిపాల్ రాగానే అతణ్ని తోసేశాడు. బాధితుడి తల్లి తెలిపిన వివరాల ప్రకారం.. 

‘నెల రోజులుగా ప్రిన్సిపాల్ నా కొడుకుని వేధిస్తున్నాడు. క్లాస్ మేట్స్ అందరి ముందు అసభ్య పదజాలంతో దూషిస్తున్నాడు. కొన్ని సార్లు ఆత్మహత్య చేసుకోవాలనిపించిందని నా కొడుకు చెప్పాడు. రెండు నెలల క్రితం మాకు ప్రిన్సిపాల్ కు మధ్య వాదన జరిగింది. అప్పటి నుంచి అతను మా అబ్బాయిని టార్గెట్ చేసినట్లు అనిపిస్తోంది’

‘చదువుపరంగా నా కొడుకు బాగానే ఉన్నాడు. చదువులో మెరుగ్గా ఉన్నప్పటికీ బీ2 సెక్షన్లోనే ఉండిపోయాడు. కొద్ది రోజుల ముందు సీ సెక్షన్ కు బదిలీ చేశారు. దీని గురించి ప్రిన్సిపాల్ ను అడగడానికి బూతులు తిట్టి పంపించేశాడ’ని విద్యార్థి తల్లి తెలిపింది. 

విద్యార్థి తండ్రి మాట్లాడుతూ.. ప్రిన్సిపాల్ తో మాట్లాడినప్పుడు అతని మాటలు అసభ్యకరంగా అనిపించాయి. నా భార్యతో అలా మాట్లాడవద్దని చెప్పా. ఆ ఘటన మనస్సులో పెట్టుకుని నా కొడుకుపై కక్ష పెట్టుకున్నట్లుగా అనిపిస్తోంది. మేం ఫీజు మొత్తం కట్టేశాం. మా డబ్బులు తిరిగిచ్చేస్తే వేరే కాలేజీలోనైనా జాయిన్ చేసుకుంటాం’ అని అతని తండ్రి వాపోయాడు. బాలల రక్షణ చట్టం ప్రకారం.. ప్రిన్సిపాల్ హరిబాబుపై కేసు నమోదైంది.