రాష్ట్రపతి భవన్‌లో నకిలీ ఇంటర్వ్యూలు: 22మంది అరెస్టు

ఉద్యోగాలిస్తామని టోకరా పెట్టేవాళ్లు అక్కడాఇక్కడా కాదు. రాష్ట్రపతి భవన్ నే వేదికగా వాడుకున్నారు నలుగురు ఉద్యోగులు. కొన్నేళ్లుగా పనిచేస్తున్న రాష్ట్రపతి భవన్లో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని మభ్యపెట్టి మోసానికి పాల్పడ్డారు. అభ్యర్థుల నుంచి రూ.30లక్షల వరకూ కాజేశారు. ఓ బాధితుడి ఫిర్యాదు మేర తీగలాగితే డొంక కదిలినట్లు వ్యవహారమంతా బయటకువచ్చింది.
మోతీలాల్(36), మోనూ వైడ్(24), హరేంద్ర సింగ్, రాహుల్ మిశ్రా అనే నలుగురు వ్యక్తుల్ని పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. మోతీ లాల్ అనే వ్యక్తి 2006లో రాష్ట్రపతి భవన్ లో ఉద్యోగంలో చేరాడు. వైడ్, మిశ్రాలు మల్టీ టాస్కింగ్ స్టాఫర్లుగా ఉద్యోగం చేస్తున్నారు. సింగ్ 2018లో వీఐపీ సెక్యూరిటీ యూనిట్ హెడ్ క్వార్టర్స్‌లో కీలక పదవిలో ఉన్నాడు.
ఈ నేరంలో సింగ్‌దే ప్రధాన పాత్ర.. మరో ముగ్గురితో కలిసి మోసానికి ఒడిగట్టాడు. సతీశ్ కుమార్ అనే వ్యక్తి సౌత్ ఎవెన్యూ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశాడు. అతని మేనల్లుడితో పాటు మరో 17మందిని ఉద్యోగాలిప్పిస్తామని మోసం చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు.
వ్యూహం ప్రకారం.. ముగ్గురికి ఇంటర్వ్యూకు రమ్మంటూ కాల్ లెటర్లు పంపారు. గతేడాది మే నెలలో రాష్ట్రపతి భవన్ లో ఇంటర్వ్యూలు ఉన్నాయంటూ పిలిచారు. గేట్ నెంబరు 17నుంచి ఎంటర్ అయి 2వ నెంబర్ గెస్ట్ హౌజ్ లో ఇంటర్వ్యూలు జరిగాయి. అక్కడ మిశ్రా, వైడ్ లు ఫార్మల్ డ్రెస్ లలో కూర్చొని జాయింట్ సెక్రటరీలుగా నటించారు. అందులో ఒకరిని ముందు రూ.4లక్షలు ఇమ్మని ఉద్యోగం వచ్చిన తర్వాత రూ.4లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.