దొంగలు పరేషాన్ : CCTV రికార్డర్ అనుకుని TV Set-up Box చోరీ

పట్టపగలే దొంగతనానికి దొంగలు స్కెచ్ గీశారు. అప్పుడు నిట్టమధ్యాహ్నం.. చేతుల్లో నాలుగు తుపాకులు పట్టుకున్నారు. ఓ జ్యుయెలరీ షాపులో చొరపడ్డారు. బంగారం, నగదు సహా రూ.26లక్షలు చోరీ చేశారు. ఇక పారిపోవడమే మిగిలి ఉంది. ఇంతలో దొంగలకు ఆలోచన వచ్చింది. సీసీ కెమెరాల వైపు చేశారు. చోరీ చేసిన అనవాళ్లు లేకుండా చేయాలని భావించారు. పోతూ పోతూ సీసీటీవీ రికార్డును ఎత్తుకెళ్లాలని చూశారు. తప్పించుకునే కంగారులో సీసీటీవీ రికార్డర్ అనుకుని పొరబడి పక్కనే ఉన్న టీవీ సెట్ టాప్ బాక్సును ఎత్తుకెళ్లారు. నిజానికి అసలైన సీసీటీవీ డిజిటల్ వీడియో రికార్డర్ పోలీసుల చేతికి చిక్కింది.
షాపు యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు సీసీ ఫుటేజీని పరిశీలించారు. అందులో దొంగలు చేసి చోరీ మొత్తం రికార్డు అయింది. దొంగతనానికి వచ్చిన దొంగలు ముఖాలకు మాస్క్ కూడా ధరించలేదు. దీంతో పోలీసులకు దొంగలను పట్టుకునేందుకు సులభంగా మారింది. నగదు, బంగారంతో పారిపోయిన దొంగలను అరెస్ట్ చేసేందుకు పోలీసు బృందం రంగంలోకి దిగిందని డీసీపీ ఎస్ డి మిశ్రా తెలిపారు.
ఢిల్లీకి సమీపంలోని బేగంపూర్ లో ఉన్న జ్యుయెలరీ షాపులోకి మధ్యాహ్నం 1:30 గంటల ప్రాంతంలో దొంగలు చొరపడ్డారు. అప్పుడు షాపులో గుల్షన్ అనే వ్యక్తి ఒంటరిగా ఉన్నాడు. ముందుగా ఇద్దరు దొంగలు కస్టమర్లలా నటిస్తూ లోపలికి వచ్చారు. జ్యుయెలరీ కొంటున్నట్టుగా నటించారు. ఆ తర్వాత మరో ఇద్దరు దొంగలు లోనికి వచ్చారు. నలుగురు దొంగలు ఎవరూ ముఖానికి మాస్క్ ధరించలేదు.
వారిలో ముగ్గురు తుపాకులు చేతబట్టారు. షాపు యజమానికి భయపెట్టేందుకు తుపాకులను కౌంటర్ దగ్గర పెట్టారు. యజమానిని భయపెట్టి కొట్టి కిందపడేశారు. ఇంతలో షాపులోని రూ.25లక్షల బంగారాన్ని, లక్ష నగదును చోరీ చేశారు. పోయే ముందు సీసీ కెమెరా రికార్డర్ కూడా తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. సీసీ రికార్డర్ అనుకుని టీవీ సెటప్ బాక్సు ఎత్తుకెళ్లినట్టు డీసీపీ మిశ్రా తెలిపారు. సీసీ ఫుటేజీ ఆధారంగా దొంగలను పట్టుకునేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.