ప్రేమికులే టార్గెట్.. శ్రీధరణిని చంపింది అతడే

  • Published By: vamsi ,Published On : February 27, 2019 / 02:17 AM IST
ప్రేమికులే టార్గెట్.. శ్రీధరణిని చంపింది అతడే

Updated On : February 27, 2019 / 2:17 AM IST

పశ్చిమ గోదావరి జిల్లా కామవరపుకోట మండలం జీలకర్రగూడెంలో గత ఆదివారం ప్రేమజంటపై దాడి కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. బౌద్ధారామం కొండపైకి వెళ్లిన శ్రీధరణి, నవీన్ లను గుర్తుతెలియని వ్యక్తులు కొట్టగా.. యువతి అక్కడిక్కడికే మృతిచెందింది. గాయాలతో ప్రియుడు నవీన్‌ బయటపడ్డాడు. అయితే శ్రీధరణి హత్య కేసులో మొదట ప్రియుడే యముడా? అనే కోణంలో పోలీసులు విచారించగా.. తర్వాత పరువు హత్య అనే ఆరోపణలు వెళ్లువెత్తాయి. అయితే ఇప్పుడు ఈ కేసు విషయంలో మరో కొత్త కోణం వెలుగులోకి వస్తుంది. ఇద్దరూ కూర్చొని ఉండగా దుడ్డుకర్రతో వెనుకవైపు నుంచి వచ్చి కొట్టి చంపారని పోలీసులు భావిస్తున్నారు.
కృష్ణాజిల్లా మైలవరం మండలం చండ్రాల గ్రామానికి చెందిన పొట్లూరు రాజు అనే సైకో కిల్లర్ నవీన్‌పై దుడ్డు కర్రతో దాడి చేసి తీవ్రంగా గాయపర్చాడు. అనంతరం శ్రీధరణిని హత్య చేసినట్లుగా తెలుస్తుంది. భీముడి పాదాల సమీపంలోని ఏకాంత ప్రదేశంలో ప్రేమ జంట ఉండగా అటుగా వచ్చిన రాజు వారిపై దాడిచేసినట్లుగా భావిస్తున్నారు. ప్రేమికులు అంటే పడని రాజు మానవ మృగంలా ప్రేమికులపై నిఘా వేసి ఇలా హత్య చేసినట్లు చెబుతున్నారు. మొదట నవీన్ ను కొట్టిన తర్వాత శ్రీ ధరణిని కొట్టి చంపినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. నవీన్ అపస్మారక స్థితిలోకి పోవడంతో అతనిని అక్కడే రాజు వదిలేసి వెళ్లి ఉండవచ్చని అంటున్నారు. ప్రేమికులే టార్గెట్‌ గా రాజు ప్రేమ జంటలు ఎక్కడ కనిపిస్తే అక్కడ వాళ్లని బెదిరించి డబ్బులు గుంజుతాడని పోలీసులు చెబుతున్నారు. ప్రియుడి కళ్లముందే ప్రియురాలిపై అత్యాచారానికి చేసే వ్యక్తి రాజు అని తెలుస్తుంది.  అయితే విచారణలో పూర్తిగా వివరాలు బయటకు రావలసి ఉంది. 
శ్రీధరణిని హత్య చేసిన తరువాత ఆమె ఫోన్‌ తీసుకుని వెళ్లిపోయిన రాజు అత్తవారి ఇంటికి చేరుకున్నాడు. మృతురాలి ఫోన్‌లోని సిమ్‌ కార్డును తీసి పడేసి, తన సిమ్‌ కార్డును వేసుకుని ఫోన్ వాడడం మొదలెట్టాడు. ఆ ఫోన్‌ను అమ్ముతానంటూ ఒక సెల్‌ షాపు వద్దకు వెళ్లగా, వ్యాపారి ఫోన్‌ కొనేందుకు వ్యాపారి నిరాకరించాడు. ఫోన్‌ సిగ్నల్స్‌ ఆధారంగా సోమవారం రాజును అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. దాంతో విషయాలన్నీ బయటపడినట్లు తెలుస్తుంది. అయితే రాజు ఒక్కడే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడా..? లేక అతనికి ఇంకెవరైనా సహకరించారా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. మరోవైపు శ్రీధరణి, నవీన్‌ కుటుంబ సభ్యులు ఒకరిపై ఒకరు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. అందులో నిజమెంత అనే కోణంలో కూడా పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. నవీన్‌ నోరు విప్పితే మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది.