ఉద్యోగాల పేరుతో రూ.5 కోట్లు వసూళ్లు : టీడీపీ మాజీ మంత్రి మనవడు అరెస్ట్

  • Published By: chvmurthy ,Published On : November 3, 2019 / 07:10 AM IST
ఉద్యోగాల పేరుతో రూ.5 కోట్లు వసూళ్లు : టీడీపీ మాజీ మంత్రి మనవడు అరెస్ట్

Updated On : November 3, 2019 / 7:10 AM IST

ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగుల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసిన కేసులో టీడీపీ మాజీ మంత్రి మనవడిని విశాఖ పోలీసులు అరెస్టు చేశారు. విశాఖ జిల్లా చోడవరానికి చెందిన టీడీపీ మాజీ మంత్రి  రెడ్డి సత్యనారాయణ మనుమడు రెడ్డి గౌతమ్ దంపతులు నిరుద్యోగులకు టోకరా  వేసి సుమారు రూ.5 కోట్లు వసూలు చేసి నిలువునా ముంచారు. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో తాతతో కలిసి తరచూ సచివాలయానికి వెళ్ళే గౌతమ్  అక్కడి అధికారులతో, మంత్రులతో మాజీ మంత్రి మనవడిగా పరిచయాలు పెంచుకుని వారితో ఫోటోలు దిగాడు.

రెడ్డి గౌతమ్ కు చిత్తూరు జిల్లా రామచంద్రాపురానికి  చెందిన టీడీపీ నాయకుడు ఎల్లంటి భక్తవత్సలం కుమార్తె లోచినితో 2013లో వివాహాం అయ్యింది. వీరు ఉపాధి కోసం అమ్మ మ్యాన్ పవర్ సెక్యూరిటీస్ అనే సంస్ధను ఏర్పాటు చేసారు. తన భార్య మధ్యప్రదేశ్‌ ఐఏఎస్‌ క్యాడర్‌కు చెందిన అధికారి అని, చంద్రబాబు తనకు బాగా సన్నిహితమని చెప్పుకుంటూ, మంత్రులు అధికారులతో దిగిన ఫొటోలు చూపుతూ ప్రభుత్వ, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ప్రచారం చేసుకున్నాడు. ఇందుకు అతని భార్య కూడా సహకరించింది. దాని ద్వారా  నిరుద్యోగులనుంచి రూ.5 కోట్లు వసూలు చేశారు భార్య భర్తలు.

దీనికి సంబంధించి నకిలీ నియామక పత్రాలు కూడా అందచేశారు. ఉద్యోగంలో చేరటానికి వెళ్లే సరికి అవి నకిలీవని తేలింది. దీనిపై బాధితులు విజయవాడ, విశాఖ ప్రాంతాల్లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న విశాఖ పోలీసులు విచారణ జరిపి నిందితులను అరెస్ట్‌ చేశారు. వారిని అదనపు చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ కోర్టులో హాజరు పరచగా న్యాయమూర్తి వారికి రిమాండ్‌ విధించారు.