కుటుంబంలో విషాదం నింపిన టిక్ టాక్ : పోలీసుల నుంచి ఫోన్, ఆ వెంటనే ఆత్మహత్య

  • Published By: veegamteam ,Published On : August 31, 2019 / 03:58 PM IST
కుటుంబంలో విషాదం నింపిన టిక్ టాక్ : పోలీసుల నుంచి ఫోన్, ఆ వెంటనే ఆత్మహత్య

Updated On : August 31, 2019 / 3:58 PM IST

టిక్ టాక్ లో పరిచయం చివరికి విషాదంగా మారింది. ఓ కుటుంబంలో తీరని శోకం నింపింది. ఓ యువకుడి ప్రాణం పోయేలా చేసింది. వివరాల్లోకి వెళితే.. ఎర్రగడ్డ నేతాజీనగర్ నివాసి సాయి(24) జొమాటోలో డెలివరీ బాయ్ గా పని చేస్తున్నాడు. కొంతకాలం కిందట కర్నూలుకి చెందిన ఓ యువతితో సాయికి టిక్ టాక్ లో పరిచయం ఏర్పడింది. అది కాస్తా స్నేహంగా మారింది. స్నేహాన్ని అడ్డు పెట్టుకుని సాయి తన అవసరాలకు యువతి నుంచి నగలు తీసుకున్నాడు. వ్యక్తిగత అవసరాల కోసం వాటిని తాకట్టు పెట్టాడు. కొంతకాలం తర్వాత తన నగలు తిరిగి ఇవ్వాలని యువతి సాయిని కోరింది. 

నగలు ఇవ్వకపోవడంతో యువతి తన తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు కర్నూలు పోలీసులను ఆశ్రయించారు. సాయి తమ కూతురు దగ్గర డబ్బు, బంగారం తీసుకుని మోసం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. సాయి మీద ఫ్రాడ్ కేసు బుక్ చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విచారణలో భాగంగా కర్నూలు పోలీసులు సాయికి ఫోన్ చేశారు. తమ ముందు హాజరుకావాలన్నారు. కర్నూలు పోలీసుల నుంచి ఫోన్ రావడంతో సాయి తీవ్ర టెన్షన్ కు గురయ్యాడు. డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడు. పోలీసులు తనని అరెస్ట్ చేస్తారని బాగా భయపడ్డాడు. ఇంట్లోనే ఉరేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. సాయి మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న యువతి, ఆమె కుటుంబసభ్యులు, కర్నూలు పోలీసులు షాక్ తిన్నారు. సాయి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

టిక్ టాక్ కారణంగా చాలా అనర్థాలు జరుగుతున్నాయి. టిక్ టాక్ లో పరిచయాలు ట్రాజెడీకి దారితీస్తున్నాయి. ఇలాంటి ఘటనలు అనేకం వెలుగులోకి వచ్చాయి. సోషల్ మీడియా వేదికల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అపరిచిత వ్యక్తులతో పరిచయాలు, స్నేహాలు చెయ్యకపోవడమే మంచిందంటున్నారు. టిక్ టాక్ ద్వారా పరిచయం చేసుకుని అమ్మాయిలను బ్లాక్ మెయిల్ చేసిన ఘటనలూ ఉన్నాయని పోలీసులు తెలిపారు.