దారుణం : పెళ్ళైన మర్నాడే వధువును కిడ్నాప్ చేసి రేప్ చేశారు

దేశంలో మహిళలపై జరుగుతున్న అత్యాచార కేసుల్లో నిందితులకు శిక్షలు పడుతున్నప్పటికీ మహిళలపై అఘాయిత్యాలు, ఆత్యాచారాలు మాత్రం తగ్గటం లేదు. తాజాగా ఉత్తర ప్రదేశ్ లో అప్పుడే పెళ్లైన నవ వధువుపై దారుణానికి ఒడిగట్టారు కొందరు కీచకులు. పెళ్ళైన మర్నాడే ఆమెపై లైంగిక దాడి జరిపారు.
హాపూర్ జిల్లాలో ఈ ఘటన సంచలనం రేపింది. ఠానా దేహాట్ ప్రాంతానికి చెందిన యువతికి జనవరి 17న ఓ యువకుడితో వివాహమైంది. పెళ్ళైన తర్వాత అప్పగింతల అనంతరం ఆమెను అత్తారింటికి తీసుకెళ్లారు. అయితే ఆ తర్వాత రోజు జనవరి 18 ఉదయాన అత్తారింటికి వచ్చిన కొత్త కోడలు కనిపించకుండా పోవడంతో ఇంట్లో అందరూ కంగారుపడ్డారు. ఇంటి నిండా చుట్టాలతో కళకళలాడుతున్న సమయంలో ఆ యువతి కనిపించకుండా పోవడంతో ఆందోళన చెందారు.
గ్రామంలో ఎంత వెతికినా ఆమె ఆచూకీ దొర్కకపోవటంతో మిస్సింగ్ కేసుగా హఫీజ్ పూర్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గ్రామానికి వచ్చి విచారణ చేప్టటారు. ఆదివారం 19వ తేదీ ఉదయం ఆయువతి హాపూర్‌లోని ఓ బ్యాంకు సమీపంలో అపస్మారక స్థితిలో పడి ఉండగా కనుగొన్నారు. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
ఇంటి నుంచి కిడ్నాప్ చేసిన గుర్తు తెలియని వ్యక్తులు ఆమెపై సామూహిక లైంగిక దాడికి ఒడిగట్టారు. ఈ ఘటనతో బాధితురాలు షాక్ లోకి వెళ్లిపోయింది. ప్రస్తుతం ఆమెకు చికిత్స అందిస్తున్నారు. ఇద్దరు యువకులు తనను బైక్ పై కిడ్నాప్ చేసి తీసుకువెళ్లి అత్యాచారం చేశారని ఆమె పోలీసులకు తెలిపింది. అందులో ఒకరు వీడియో తీశారని బాధితురాలు పోలీసులకు వివరించింది. బాధితురాలి వాంగ్మూలం నమోదు చేసుకున్నపోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.