నిందితుడు వీడే : చిన్నారి వర్షిత హత్యాచారం కేసుని చేధించిన పోలీసులు

చిత్తూరులో జిల్లాలో సంచలనం సృష్టించిన వర్షిత హత్యాచారం కేసులో మిస్టరీని పోలీసులు చేధించారు. హంతకుడిని గుర్తించారు. బసినికొండకు చెందిన లారీ డ్రైవర్ రఫీ ఈ దారుణానికి పాల్పడినట్లు నిర్దారించారు. ఆరేళ్ల వర్షితపై లైంగిక దాడి చేసి హత్య చేసినట్లుగా పోలీసులు తేల్చారు. నిందితుడుని పోలీసులు మధ్యాహ్నం మీడియా ముందు ప్రవేశపెట్టారు. సీఎం జగన్ ఆదేశాలతో కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు. ఇదివరకే గ్రామంలో చిన్నారి వర్షిత పట్ల లారీ డ్రైవర్ రఫీ అసభ్యంగా ప్రవర్తించినట్లు పోలీసుల విచారణలో తెలిసింది.
చిత్తూరు జిల్లా బీ కొత్తకోట మండలం గుట్టపాళ్యంకు చెందిన చిన్నారి వర్షిత (6) తల్లిదండ్రులతో కలిసి బుధవారం(నవంబర్ 6,2019) రాత్రి కురబలకోట మండలం చేనేతనగర్‌లో ఓ పెళ్లి వేడుకకు వెళ్లింది. కాసేపటికి చిన్నారి కనిపించకుండా పోయింది. ఈ క్రమంలో శుక్రవారం(నవంబర్ 8,2019) ఉదయం చిన్నారి మృతదేహం లభ్యమైంది. పెళ్లి జరిగిన ఫంక్షన్ హాల్‌కు సమీపంలోని నిర్మానుష్య ప్రదేశంలో మృతదేహం లభించింది.
పోస్టుమార్టంలో సంచలన విషయం వెలుగుచూసింది. చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేసినట్టు తేలింది. చిన్నారిపై అమానుష ఘటన సంచలనం రేపింది. హంతకుడిని పట్టుకుని కఠిన శిక్ష విధించాలని పోలీసులను డిమాండ్ చేశారు. ఈ కేసుని సవాల్ గా తీసుకున్న పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి అన్ని కోణాల్లో విచారణ జరిపారు. చివరికి హంతకుడిని పట్టుకున్నారు.