Extra Marital Affair : ఎదిగిన కొడుకున్నా అక్రమ సంబంధం కోసం….
వివాహేతర సంబంధాలతో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని తెలిసినా వాటిపై వ్యామోహం మాత్రం ప్రజలకు తగ్గటం లేదు. తాజాగా చిత్తూరు జిల్లాలో వివాహేతర సంబంధంతో ఒక మహిళ భర్తను చంపి గుండెపోటుతో మరణించాడని నమ్మించటానికి ప్రయత్నం చేసింది.

Dead Body
Extra Marital Affair : వివాహేతర సంబంధాలతో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని తెలిసినా వాటిపై వ్యామోహం మాత్రం ప్రజలకు తగ్గటం లేదు. తాజాగా చిత్తూరు జిల్లాలో వివాహేతర సంబంధంతో ఒక మహిళ భర్తను చంపి గుండెపోటుతో మరణించాడని నమ్మించటానికి ప్రయత్నం చేసింది. పోలీసు విచారణలో నిజం బయట పడేసరికి నేరం ఒప్పుకోక తప్పలేదు.
చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం అరిగెలవారి పల్లెకి చెందిన వాసు(46), స్వప్నప్రియ దంపతులు. వారికి ఎదిగిన కొడుకు ఉన్నాడు. వాసు చిత్తూరు కలెక్టరేట్‌లో అటెండర్‌గా పని చేస్తున్నాడు. కొడుకును బంధువుల ఇంటిదగ్గర ఉంచి చదివిస్తూ…. దంపతులిద్దరూ చిత్తూరులో కాపురం ఉంటున్నారు. భర్త ఆఫీసుకు వెళ్లిన తర్వాత ఖాళీగా ఉంటున్న స్వప్నప్రియ, కొన్నాళ్లుగా మరోక వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది.
ఇంట్లో ఎదిగిన కొడుకు ఉన్నా ఆమెకు ప్రియుడిపై మోజు పెరగసాగింది. భర్త ఆఫీసుకు వెళ్లగానే ఎవరికీ తెలియకుండా ఆమె ప్రియుడితో గడిపేది. రాన్రాను ప్రియుడిపై మోజు ఎక్కువయ్యింది. ఈ విషయం నలుగురికి తెలిస్తే పరువు పోతుందని భయపడింది. తన అక్రమ సంబంధం కొనసాగాలంటే భర్తను అడ్డు తొలగించుకోవాలనుకుంది. పైగా భర్త ప్రభుత్వ ఉద్యోగి. అతను మరణిస్తే తనకు డబ్బుకూడా వస్తుందని ఆశపడింది.
ఎవరికీ అనుమానం రాకుండా భర్తను తుదముట్టించాలనుకుంది. ప్రియుడితో కలిసి ప్లాన్ వేసింది. జులై 19న నిద్ర పోతున్న భర్త గొంతు పిసికి ఊపిరాడకుండా చేసి భర్తను చంపింది. తెల్లారాక గుండెపోటుతో భర్త మరణించినట్లు చెప్పి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేసింది. ఇంటికి వచ్చిన కొడుకు తండ్రిని చూసి భోరున విలపించాడు. తండ్రి శవాన్ని దగ్గరగా చూసినప్పుడు వాసు మెడపై గాయాలు ఉన్నట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం పంపారు. పోస్టుమార్టం నివేదికలో మెడ ఎముకలు విరిగినట్లు, ఊపిరాడకపోవటం వల్ల మరణించినట్లు తేలింది. పోలీసులు హత్యాకేసుగా నమోదు చేసి విచారణ చేపట్టారు. స్వప్నప్రియను అదుపులోకి తీసుకున్న పోలీసులతో చేసిన నేరం ఒప్పుకుంది. ఈ హత్యలో స్వప్నప్రియ ఒక్కతే పాల్గోందా… ఇంకెవరైనా సహాయం చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.