విషాద ఘటన: తల్లీబిడ్డ ప్రాణాలను బలిగొన్న లారీ.. చావుబతుకుల్లో కొడుకు

మృత్యుశకటంలా దూసుకొచ్చిన లారీ.. తల్లీబిడ్డ ప్రాణాలను బలిగొన్న విషాద ఘటన తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం ఆమడూరులో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది.

విషాద ఘటన: తల్లీబిడ్డ ప్రాణాలను బలిగొన్న లారీ.. చావుబతుకుల్లో కొడుకు

Woman with her daughter killed as truck rams them in Tirupati district

Updated On : July 15, 2024 / 12:00 PM IST

Tragedy Incident: మృత్యుశకటంలా దూసుకొచ్చిన లారీ.. తల్లీబిడ్డ ప్రాణాలను బలిగొన్న విషాద ఘటన తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం ఆమడూరులో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. పుట్టింటికి వచ్చి తిరిగివెళుతున్న మహిళతో పాటు ఆమె కూతురిని లారీ పొట్టనపెట్టుకుంది. మృతురాలి నాలుగేళ్ల కుమారుడు తీవ్ర గాయాలతో చావుబతుకుల్లో ఉన్నాడు. మృతురాలి తల్లికి స్వల్పగాయాలయ్యాయి.

ఆమడూరు క్రాస్ రోడ్డు వద్ద ఆటో కోసం వేచిచూస్తున్న నలుగురిపైకి లారీ దూసుకెళ్లి చెట్టును ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో తల్లీకూతుళ్లు శారద (22), వైష్ణవి (2) మృతి చెందారు. శారద కొడుకు కార్తీక్(4) తీవ్రంగా గాయపడ్డాడు. శారద తల్లి విజయమ్మకు స్వల్పగాయాలతో బయటపడింది. వీరిద్దరినీ సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. శారద రెండ్రోజుల క్రితం రేణిగుంట మండలం మల్లవరంలోని పుట్టింటికి వచ్చి, తిరిగి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఏర్పేడు పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని లారీ డ్రైవర్ ను అదుపులో తీసుకున్నారు. రోడ్డు ప్రమాదంలో తల్లీకూతుళ్లు ప్రాణాలు కోల్పోవడంతో శారద కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

లారీని బస్సు ఢీకొనడంతో..
చిత్తూరు జిల్లా పి.కొత్తకోట ఓవర్ బ్రిడ్జి సమీపంలో లారీని బస్సు ఢీకొనడంతో జరిగిన మరో ప్రమాదంలో ఐదుగురు స్వల్పంగా గాయపడ్డారు. లారీ సడన్ బ్రేక్ వేయడంతో వెనుకున్న బస్సు ఢీకొట్టింది. దీంతో బసులోని ఐదుగురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. వీరిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించారు. తర్వాత వీరిని మరో బస్సులో పంపించారు.

మామిడి పండ్లు లారీ బోల్తా
చిత్తూరు జిల్లా క్రిష్ణగిరి – పలమనేరు జాతీయ రహదారిపై శాంతిపురం మండలం 7వ మైలు వద్ద రహదారిపై మామిడి పండ్లు లారీ బోల్తా పడింది. దీంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది. వందలాది వాహనాలు నిలిచిపోవడంతో రెండు గంటల పాటు రాకపోకలకు అంతరాయం కలిగింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దడంతో వాహదారులు ఊపిరిపీల్చుకున్నారు.

Also Read : భార్యాభర్తల ప్రాణాల మీదకు తెచ్చిన ఫోటోషూట్.. ఎంత ఘోరం జరిగిపోయిందో చూడండి.. వీడియో వైరల్

బోల్తా పడిన వాహనం.. 15 మందికి గాయాలు
పుంగనూరు, బోయకొండ మార్గంలో కరణంవారిపల్లె సమీపంలో ఆదివారం జరిగిన ప్రమాదంలో 15 మంది గాయపడ్డారు. టాటా ఏస్ వాహనం బోల్తా పడడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. వీరిని మదనపల్లెలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.