చదివింది ఏడో తరగతి..మాటలతో మాయ చేస్తాడు

  • Published By: madhu ,Published On : October 24, 2019 / 04:42 AM IST
చదివింది ఏడో తరగతి..మాటలతో మాయ చేస్తాడు

Updated On : October 24, 2019 / 4:42 AM IST

చదివింది ఏడో తరగతి. విప్రోలో టీం లీడర్‌గా పని చేస్తున్నట్లు మాటలతో నమ్మించేస్తాడు. సూటు, బూటు వేష భాషలతో కనికట్టు చేసేస్తాడు. అతని చూస్తే..నిజంగానే చెబుతున్నాడని అనిపిస్తుంది. తన పలుకుబడితో ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేస్తాడు. ఇతని మోసాలకు పోలీసులు చెక్ పెట్టారు. దాదాపు 50 మందిని మోసం చేసిన ఇతడిని కటకటాల్లోకి నెట్టారు. ఈ ఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే…

కరీంనగర్ జిల్లా, వావిలాలపల్లికి చెందిన రిషిరెడ్డి అలియాస్ హరీష్ 7వ తరగతి మాత్రమే చదివాడు. విప్రో కంపెనీలో టీం లీడర్‌గా పనిచేస్తున్నట్లు బిల్డప్ ఇచ్చేవాడు. పెద్ద జీతంతో ఉద్యోగాలు ఇప్పిస్తానని, పెద్ద పెద్ద వారితో పరిచయాలున్నట్లు నిరుద్యోగులను నమ్మబలికే వాడు. నిరుద్యోగులను నమ్మించి వారి నుంచి రూ. 4 లక్షలు వసూలు చేసేవాడు. ఆ డబ్బుతో విల్లాలు, స్టార్ హోటళ్లలో బస చేస్తూ విలాసవంతమైన జీవితం గడిపేవాడు. కరీంనగర్, నిజామాబాద్, గోదావరి ఖని ప్రాంతాల్లో ఇదే తరహాలో మోసాలకు పాల్పడ్డాడు. దాదాపు 50 మందిని మోసం చేశాడు.

ఆరుగురు బాధితులు వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో కంప్లయింట్ చేశారు. గత జులైలో హైదరాబాద్‌కు మాకం మార్చాడు రిషిరెడ్డి. హోటల్ నిర్వాహకుడు సురేష్‌తో పరిచయం చేసుకున్నాడు. బంధువులకు ఉద్యోగం ఇప్పిస్తానంటూ విప్రో కంపెనీకి తీసుకెళ్లాడు. అనంతరం ఒక దగ్గర కూర్చొబెట్టి..పైన ఉండే ఆఫీసులోకి వెళ్లాడు. తిరిగి వచ్చి ఉద్యోగం వచ్చిందని..నకిలీ ఆర్డర్ కాపీని అంటకట్టాడు. వీరి నుంచి రూ. 4 లక్షలు వసూలు చేశాడు. బయటకు వెళ్లి వస్తానని చెప్పి బైక్‌పై పరారయ్యాడు. అనుమానం వచ్చిన బాధితులు కంపెనీకి వెళ్లి విచారించారు.

ఆ పేరిట ఎవరూ లేరని సమాధానం ఇవ్వడంతో మోసపోయామని గ్రహించి లబోదిబోమంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ట్యాంక్ బండ్ వద్ద తిరుగుతున్న రిషిరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నేరం అంగీకరించాడు. అతడి నుంచి బైక్, 3 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌‌కు తరలించారు. 
Read More : హుజూర్ నగర్‌లో కారు టాప్ గేర్ : సంతోషంగా ఉంది – సైదిరెడ్డి