ఏపీపీఎస్సీలో అంతా గందరగోళం

  • Published By: madhu ,Published On : January 14, 2019 / 01:18 PM IST
ఏపీపీఎస్సీలో అంతా గందరగోళం

విజయవాడ : ఏపీపీఎస్సీలో తీవ్ర గందరగోళం నెలకొంది. స్ర్కీనింగ్ టెస్ట్ నుంచి ప్రత్యేక మినహాయింపులతో మెయిన్స్‌కు ఎంపికయ్యే రిజర్వుడ్ కేటగిరీ అభ్యర్థులు వారి రిజర్వుడ్ కేటగిరీ పోస్టులకు మాత్రమే పరిమితం కావాల్సి ఉందని ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విధించిన నియమ నిబంధనలు దుమారాన్ని రేపుతున్నాయి. దీంతో ఎస్సీ, ఎస్టీ గెజిటెడ్ అధికారుల సంఘం మండిపడుతోంది. ఏపీపీఎస్సీ తీరు రాజ్యాంగ విరుద్ధమని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ కేటగిరీలకు చెందిన లక్షలాది మంది అభ్యర్థులు నష్టపోయే ప్రమాదం ఉందంటున్నారు. ఇప్పటికే ఆయా కేటగిరీల అభ్యర్థులతోపాటు ఈ గెజిటెడ్ అధికారుల సంఘం కూడా ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది.
ఏపీపీఎస్సీ అయిష్టత…
ప్రభుత్వం తక్షణం స్పందించి ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయబోతున్న ఉద్యోగాల్లో రిజర్వేషన్లతో పాటు ఓపెన్ కేటగిరిలోనూ ప్రత్యేక మినహాయింపు పొందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు అవకాశం కల్పించాలని సర్కార్ కమిషన్‌ను ఆదేశించడంతో రాష్ట్ర సాధారణ పరిపాలనా శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఏపీపీఎస్సీకి లేఖ రాశారు. అయితే ఈ ఆదేశానుసారంగా అమలు చేయడానికి ఏపీపీఎస్సీ అయిష్టత చూపుతోంది. ఇదిలా ఉంటే జనవరి 23న ఏపీపీఎస్సీ సమావేశం కానుంది. ఈ సమావేశంలో ప్రభుత్వ కార్యదర్శి లేఖ, వివిధ ఖాళీల భర్తీకి జారీ చేయాల్సిన నోటిఫికేషన్లపై కూడా చర్చించనున్నారు. కమిషన్ తీసుకొనే నిర్ణయానుసారం తాము చర్యలు చేపడతామని ఏపీపీఎస్సీ స్పష్టం చేస్తోంది.