ఉద్యోగుల పదవీ విరమణ వయసు 2 ఏళ్లు పెంపు!

తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగుల పదవీ విరమణ వయసును రెండేళ్లకు పెంచనుంది.

  • Published By: veegamteam ,Published On : February 19, 2019 / 03:44 AM IST
ఉద్యోగుల పదవీ విరమణ వయసు 2 ఏళ్లు పెంపు!

తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగుల పదవీ విరమణ వయసును రెండేళ్లకు పెంచనుంది.

హైదరాబాద్‌ : రాష్ట్రంలో ఉద్యోగుల పదవీ విరమణ వయసును రెండేళ్లకు పెంచనున్నారు. రాష్ట్రం ప్రభుత్వం వయో పరిమితిని 60 ఏళ్లకు పెంచనున్నట్లు తెలుస్తోంది. పదవీ పరిమణ వయసు పెంచడంపై రాష్ట్ర ప్రభుత్వం ఒక అవగాహనకు వచ్చినట్లు కూడా విశ్వసనీయ సమాచారం. రిటైర్మెంట్‌ 61 ఏళ్లకు పెంచనున్నట్లు టీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. ఈ మేరకు రిటైర్మెంట్ ను 61 సంవత్సరాలు కాకుండా 60 ఏళ్లకు పెంపు దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉద్యోగుల పదవీ విరమణ వయసు 58 సంవత్సరాలు. సీఎం కేసీఆర్‌ ఉద్యోగులకు ఇచ్చిన హామీని అమలు చేయడం, ఇప్పటికే ఉన్న ఖాళీలను భర్తీ చేయడం ద్వారా నిరుద్యోగుల ఆశలను నెరవేర్చడమనే ద్విముఖ వ్యూహంతో ఒక ఆలోచన చేసినట్లు తెలిసింది.

ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి పదవీ విరమణ వయసు పెంపును అమల్లోకి తీసుకు రావాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీనిని మొదటగా రెండేళ్లు.. అంటే 2021 వరకే పరిమితం చేయాలని భావిస్తోంది. ఆ రెండేళ్లలో సుమారు 15 వేల మంది ఉద్యోగులు పదవీ విరమణ చేయవచ్చని ఆర్థిక శాఖ అంచనా వేసింది. వీరందరికీ పదవీ విరమణ ప్రోత్సాహకాలు అందించడానికి రూ.2000 కోట్లకుపైగా అవసరమని లెక్కలు వేసింది. ఈ రెండేళ్లలో ఖాళీల భర్తీకి ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది.

2 సంవత్సరాల తర్వాత పరిస్థితిని సమీక్షించి తదనుగుణంగా ప్రభుత్వ నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది. కాగా.. రాష్ట్రంలో పర్యటిస్తున్న 15వ ఆర్థిక సంఘంతో ఫిభ్రవరి 19 మంగళవారం భేటీ అయినప్పుడు రాష్ట్రానికి ఆర్థికంగా చేయూత ఇవ్వాలని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు కోరనున్నారు. అవకాశం, సమయం ఉంటే ఉద్యోగుల అంశాన్ని ఆయన ప్రస్తావించనున్నట్లు సమాచారం.