12 వేల స్కూళ్లు మూసివేత ? : విద్యాహక్కు చట్టానికి సవరణ

తెలంగాణా రాష్ట్రంలో దాదాపు 12వేల స్కూళ్ల మూసివేతకు రంగం సిధ్దమవుతోంది. విద్యా హక్కు చట్టానికి సవరణ చేయటం వల్ల ఈ పరిస్ధితి తలెత్తుతోంది. విద్యా హక్కు చట్టం ప్రకారం నివాస ప్రాంతానికి (నైబర్‌హుడ్) కిలోమీటర్ దూరంలో ప్రాథమిక పాఠశాల, 3 కి.మీ. దూరంలోపు ప్రాథమికోన్నత పాఠశాల, 5 కిలోమీటర్లలోపు ఉన్నత పాఠశాల ఉండాలి. నైబర్‌హుడ్ పరిధి పెంచేందుకు కసరత్తు మొదలైందని విద్యాశాఖ అధికారులు నిర్ధారించారు. పాఠశాల కేటగిరీని బట్టి ఒక కిలోమీటర్, 3 కి.మీ., 5 కి.మీ. ఉండగా, ఇకపై అన్నింటికి 5 కి.మీ. దూరాన్నే వర్తింపజేసే ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది. అదీ కాక కొన్ని పాఠశాలల్లో కనీస విద్యార్ధులు లేని పరిస్ధితి ఉంది. విద్యాహక్కు సవరణ చట్టంలోమార్పులు చేయటానికి ఒక కమిటీని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కమిటీలో హైదరాబాద్ ఆర్జేడీ, డీఈవో, రంగారెడ్డి డీఈవో, రెండు జిల్లాల నుంచి ఒక డిప్యూటీ ఈవో, ఎంఈవోతో పాటు సమగ్రశిక్షా అభియాన్ నుంచి ఏఎస్ పీడీ నుంచి ఒకరు సభ్యులుగా ఉన్నారు. విద్యాహక్కు చట్టం సవరణలపై పరిశీలన చేయాలని విద్యాశాఖ ఈ కమిటీని ఆదేశించింది. దీనిపై నవంబర్ 22, 2019 న సమావేశం నిర్వహించనున్నారు.
చట్టానికి సవరణ చేస్తే రాష్ట్రవ్యాప్తంగా సుమారు 12 వేల స్కూళ్ళు మూత పడనున్నాయి. ఇప్పటికే సుమారు 4 వేల స్కూళ్ల వరకు మూసివేతకు రంగం సిద్ధం చేసిన అధికారులు ఇప్పుడు ఈ కొత్త నిబంధనతో మరిన్ని స్కూళ్లు మూసివేసే అవకాశం ఉంది. దీనిపై ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నిర్ణయం అమలైతే తెలంగాణలో ప్రభుత్వ పాఠశాల విద్య కనుమరుగయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇందులో మెజార్టీ పాఠశాలలు ప్రాథమిక పాఠశాలలే కావడం గమనార్హం. గతంలోనే 15 మంది విద్యార్థుల లోపు ఉన్న పాఠశాలలను దగ్గర్లోని పాఠశాలల్లో విలీనం చేయాలని నిర్ణయించారు. దీంతో 3 వేల బడులు మూత పడతాయని అంచనా వేశారు. రాష్ట్రంలో మొత్తం 26,050 ప్రభుత్వ, పంచాయతీరాజ్ పాఠశాలలున్నాయి. వీటిలో 18230 ప్రాథమిక, 3179 ప్రాథమికోన్నత, 4641 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. 916 పాఠశాలల్లో జీరో అడ్మిషన్లు ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. విద్యాశాఖ నిర్ణయం అమలైతే గ్రామీణ ప్రాంతాల్లోని ప్రాథమిక పాఠశాలలు 70 శాతం మూతపడే ప్రమాదం ఉంది.
కేంద్రం తెస్తున్నన్యూ ఎడ్యుకేషనల్ పాలసీ ఇదే
కేంద్ర ప్రభుత్వం త్వరలో అమల్లోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టిన నూతన విద్యా విధానంలో కూడా స్కూల్ కాంప్లెక్స్ పేరుతో ఉన్నత పాఠశాలలను అభివృద్ధి చేయాలని భావిస్తోంది. ఆ కాంప్లెక్స్‌కు 5 నుంచి 10 మైళ్ల పరిధిలో కింది తరగతులతో కూడిన పాఠశాలలను కొనసాగించాలని గతంలోనే ఎడ్యుకేషన్ కమిషన్ సిఫారసు చేసిందని న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అభిప్రాయపడింది. ఇప్పుడు స్కూల్ కాంప్లెక్స్ విధానాన్ని అమల్లోకి తేవాల్సిన అవసరం ఉందని పాలసీని రూపొందించిన నిపుణుల కమిటీ సిఫారసు చేసింది. అది అమల్లోకి రావాలంటే విద్యాహక్కు చట్టంలోని నివాస ప్రాంతంలో స్కూల్ ఉండాల్సిన నిర్ధేశిత పరిధిని పెంచేలా మార్పులు చేయాల్సి వస్తుంది. కేంద్రం ఇంకా దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఏం సిఫారసు చేస్తుందన్నది ఇపుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది.