పూర్తిగా కోలుకున్నారు.. కానీ 70 రోజుల తర్వాత కరోనా పాజిటివ్

కొరోనావైరస్ వ్యాధి కోవిడ్ -19 వ్యాప్తి చైనాలో చాలావరకు మందగించింది. కరోనా వైరస్ అదుపు చెయ్యడంలో ఆ దేశం చాలావరకు సక్సెస్ అయ్యింది. కరోనా వైరస్ పుట్టిన వుహాన్‌లో కూడా జీవనం సాధారణ స్థితికి వచ్చింది.
అయితే ఇప్పుడు ఒక కొత్త విషయం చైనాలోని వైద్యులను భయపెడుతుంది. కోవిడ్-19 వ్యాధి నుంచి కోలుకున్న రోగులు మళ్లీ పాజిటివ్‌గా తేలుతున్నారు. వీరి సంఖ్య రోజురోజుకు పెరుగుతుండగా.. వారిలో లక్షణాలు కనిపించకపోవడం భయపెడుతున్న అంశం.
కోవిడ్ రోగులందరూ కోలుకున్న తర్వాత వైరస్ నెగటివ్ వచ్చాక సాధారణ జీవితం మొదలెట్టారు. కానీ ఇప్పుడు మళ్ళీ వారికి పాజిటివ్ వచ్చింది. 70 రోజుల తరువాత చాలామందికి పాజిటివ్ వచ్చినట్లుగా డాక్టర్లు చెబుతున్నారు.
వైరస్ వ్యాప్తి మందగించిన క్రమంలో చాలా దేశాలు లాక్‌డౌన్‌లను అంతం చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. అంతేకాదు.. ఆర్థిక కార్యకలాపాలను తిరిగి ప్రారంభించడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ఇటువంటి సమయంలో అంటువ్యాధులు సంభవించే అవకాశం ఇంకా తగ్గలేదనే నివేదికలు.. అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా సిఫార్సు చేయబడిన ఐసోలేషన్ కాలం 14 రోజులు కాగా దానిని పెంచే ఆలోచనలో కూడా WHO ఉందని అంటున్నారు. దక్షిణ కొరియాలో కూడా ఇదే రకమైన పరిస్థితి కనిపిస్తుంది.
ఇదిలావుండగా, భారతదేశంలో కోవిడ్ -19 రోగుల సంఖ్య 1,383 పెరిగి, దేశ సంఖ్య 19,984 కు చేరుకుందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. గత 24 గంటల్లో ఈ వ్యాధి కారణంగా యాభై మంది చనిపోయినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.