ఆర్టీసీ సమ్మె 14వ రోజు : భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్న నేతలు

తెలంగాణ ఆర్టీసీలో సమ్మె కొనసాగుతోంది. 2019, అక్టోబర్ 18వ తేదీ శుక్రవారం 14వ రోజుకు చేరుకుంది. అటు ప్రభుత్వం, ఇటు కార్మిక సంఘాలు మెట్టు దిగకపోతుండడంతో ప్రతిష్టంభన నెలకొంది. కార్మిక సంఘాలు మాత్రం ఉద్యమ కార్యాచరణను కంటిన్యూ చేస్తున్నాయి. హైకోర్టులో విచారణ జరుగనుంది. దీంతో కోర్టు ఎలాంటి వ్యాఖ్యలు చేస్తుందోనన్న ఉత్కంఠ నెలకొంది.
మరోవైపు ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించింది. వంద శాతం బస్సులు రోడ్డుపై నడుపాలని, ఆ దిశగా చర్యలు తీసుకొంటోంది. అక్టోబర్ 19వ తేదీ ఇచ్చిన బంద్‌ను సక్సెస్ చేసేందుకు ఆర్టీసీ జేఏసీ నేతలు భేటీ కానున్నారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. బంద్‌ను విజయవంతం చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహాలు, కోర్టు విచారణలో ప్రస్తావించాల్సిన అంశాలపై చర్చ జరుగనుంది. ఈ భేటీ శుక్రవారం ఉదయం 9.30గంటలకు జరుగనుంది. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సకల జనుల భేరీ మహాసభ జరుగనుంది. ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా ఈ సభను నిర్వహిస్తున్నారు.
ఇదిలా ఉంటే…గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆర్టీసీ సమ్మెపై ఆరాతీయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలో సమ్మెకు పరిష్కారం లభించే అవ కాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Read More : ఏం చెబుతారో? : ఆర్టీసీ సమ్మె..హైకోర్టులో మళ్లీ విచారణ