ఇంకా నాలుగైదు స్కీమ్ లు ఉన్నాయి… అవి పెడితే కాంగ్రెస్ ఖతమే

మా దగ్గర ఇంకా నాలుగైదు స్కీమ్ లు ఉన్నాయి.. అవి పెడితే కాంగ్రెస్ ఖతమే అని సీఎం కేసీఆర్ వార్నింగ్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి నూకలు పుట్టడం లేదన్నారు. కాంగ్రెస్ సభ్యులు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నైతికత గురించి నీతులు చెప్పాల్సిన అవసరం లేదన్నారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్ ను చీల్చాలని ప్రయత్నించారని కేసీఆర్ ఆరోపించారు. గత ప్రభుత్వాల పాలన కంటే టీఆర్ఎస్ పాలన 100 రెట్లు బాగుందని ప్రజలు అంటున్నారని కేసీఆర్ చెప్పారు. ఎవరు ఏం చేశారో ప్రజలకు తెలుసన్నారు.
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కాంగ్రెస్, బీజేపీలపై సీఎం కేసీఆర్ నిప్పులు చెరిగారు. నీటి లభ్యత లేని దగ్గర ప్రాజెక్టు కట్టాలంటారని ఎద్దేవా చేశారు. ప్రాజెక్టులు కట్టాలంటారు..వాటిపైన స్టేలు తీసుకొస్తారని మండిపడ్డారు. నాగార్జున సాగర్, ఎస్సారెస్పీ ప్రాజెక్టులకు కాంగ్రెస్ అప్పులు చేయలేదా అని నిలదీశారు. అప్పు తేకుండా ఏ ప్రాజెక్టును చేపట్టారో చెప్పాలని నిలదీశారు.
మిడ్ మానేరు కింద తమకు సంబంధించిన 3 వేల ఎకరాలు మునిగిపోయిందన్నారు. సీఎంగా ఉన్నప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాకు ఒక్క రూపాయి కూడా ఇవ్వను అంటే.. కాంగ్రెస్ నేతలు ఏమాత్రం అభ్యంతరం చెప్పలేదన్నారు. 51 ఏళ్ల పరిపాలనలో ఇంటికో ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదని కాంగ్రెస్ నేతలను అడిగారు. రాష్ట్రాల హక్కులను కాంగ్రెస్ హరించిందన్నారు.