కరోనా కట్టడికి వచ్చే 3వారాలే కీలకం : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

  • Published By: chvmurthy ,Published On : March 22, 2020 / 11:16 AM IST
కరోనా కట్టడికి వచ్చే 3వారాలే కీలకం : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

Updated On : March 22, 2020 / 11:16 AM IST

దేశంలో ప్రస్తుతం కరోనా వ్యాప్తి రెండో దశలో ఉంది. వైరస్‌ వ్యాప్తి మూడో దశ (సామాజిక వ్యాప్తి–కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్‌) లోకి వ్యాపించడానికి దేశానికి కేవలం 30 రోజులు గడువే ఉంది. వైరస్‌ మూడు, నాలుగు దశలు దాటిపోతే వ్యవస్థలన్నీ కుప్పకూలే ప్రమాదం లేకపోలేదు.

ప్రస్తుతం ఉన్న వైద్య సిబ్బంది, ఆస్పత్రులు, పడకలు ఇతర మౌలిక సదుపాయాలు ఏమాత్రం సరిపోవు. చిన్న వైరసే కదా అని నిర్లక్ష్యం చేస్తే జీవితమే కోల్పొవాల్సి వస్తుంది. ముందే మేల్కొని ఎవరికి వారు స్వీయ నియంత్రణ చర్యలు చేపడితే……వైరస్‌ భారీ నుంచి సులభంగా బయటపడొచ్చని కోవిడ్‌–19 హైదరాబాద్‌ వైద్య శాఖ అధికారులు సూచిస్తున్నారు. 

మరో వైపు మార్చి 31వరకు తెలంగాణలో  లాక్ డౌన్ ప్రకటించే యోచనలో సీఎం కేసీఆర్ ఉన్నారు.  అప్పటికి పరిస్ధితి అదుపులోకి రాకపోతే ఏప్రిల్ 15 వరకు లాక్ డౌన్ ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కోవిడ్ వైరస్ వ్యాప్తిలో ఇది అత్యంత కీలకమైనది. రెండో దశలో వైరస్‌ బారిన పడిన వారి నుంచి చుట్టుపక్కల ఉన్న వారికి పెద్దెత్తున వైరస్‌ విస్తరిస్తుంది. చాలా తక్కువ సమయంలోనే వేలాది మందికి విస్తరిస్తుంది. మరణాల సంఖ్య భారీగా ఉంటుంది. నియంత్రణ కష్టమవుతుంది. ఇటలీ, ఇరాన్‌లు ప్రస్తుతం ఇదే దశను ఎదుర్కొంటున్నాయి. 

స్వీయ నియంత్రణే ఏకైక నిరోధం
బయటి దేశాల నుంచి వచ్చిన ప్రయాణికుల్లో 14 రోజుల్లో జ్వరం, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందుల తలెత్తితే కరోనా వైరస్‌గా అనుమానిస్తారు. సాధారణంగా వైరస్‌ రెండు నుంచి 14 రోజుల్లో బయటపడుతుంది. తుంపర్లు, ముట్టుకోవడం వల్ల ఒకరి నుంచి మరొకరికి విస్తరిస్తుంది. ముఖ్యంగా వృద్ధులు, చిన్న పిల్లలపై ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉంది. సాధ్యమైనంత వరకు జనసమూహానికి దూరంగా ఉండటం, ముక్కుకు మాస్కులు ధరించడం, తరచూ చేతులు శుభ్రం చేసుకోవడం, వ్యక్తిగత పరిశుభ్రతను పాటించడం ద్వారా వైరస్‌ భారీ నుంచి కాపాడుకోవచ్చు. స్వీయ నియంత్రణే చాలా ముఖ్యం.