నేను, నా చదువు నా కుటుంబానికి భారం.. నాకు చావే కరెక్ట్.. కంటతడి పెట్టిస్తున్న ఐశ్వర్య సూసైడ్ నోట్

  • Published By: naveen ,Published On : November 10, 2020 / 12:08 PM IST
నేను, నా చదువు నా కుటుంబానికి భారం.. నాకు చావే కరెక్ట్.. కంటతడి పెట్టిస్తున్న ఐశ్వర్య సూసైడ్ నోట్

Updated On : November 10, 2020 / 12:33 PM IST

degree student aishwarya suicide: అక్షరమే ఆయుధంగా అంచెలంచెలుగా ఎదుగుతున్న ఓ దీపం అనూహ్యంగా ఆరిపోయింది. ఆర్థిక ఇబ్బందులు, చేయూత ఇస్తామన్నవారు ముఖం చాటేయటం, సర్కారు సహకారమూ అందకపోవటం.. వెరసి చదువు ముందుకెళ్లే పరిస్థితి లేకపోవటం ఆమెను కలచివేసింది. ప్రతిభ ఉన్నా ఐఏఎస్‌ లక్ష్యసాధన ఇక అందని ద్రాక్షే అనుకుందో ఏమో ఉరి బిగించుకొని ప్రాణాలు తీసుకుంది.

చదువును కొనలేక ప్రాణాలు తీసుకుంది:
నా చావుకు ఎవరూ కారణం కాదు.. నా వల్ల ఖర్చులు పెరుగుతున్నాయి.. నాతో పాటు నా చదువు వారికి భారం.. నేను చాలా రోజుల నుంచి ఆలోచిస్తున్నా.. చదువు లేకపోతే నేను బతకలేను.. నాకు చావే కరెక్ట్‌ అన్పించింది.. ఓ చదువుల సరస్వతి రాసుకున్న సూసైడ్‌ నోట్‌. పై చదువులు చదువుకునే స్థోమత లేక ఓ డిగ్రీ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. కాదు కాదు…చదువును కొనలేక ప్రాణాలు తీసుకుంది. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో వెలుగు చూసింది ఈ విషాద ఘటన. నవంబర్ 3న చోటు చేసుకున్న ఈ ఘటన..ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Aishwaryas parents sitting with a photo of Aishwarya

ఫ్రీ హాస్టల్ లో ఉంటూ ఢిల్లీ శ్రీరామ్ కాలేజీలో చదువు:
ఐశ్వర్య చదువులో చిన్ననాటి నుంచే ప్రతిభ చూపేది. పదో తరగతి, ఇంటర్‌లో మంచి మార్కులు సంపాదించింది. తన అసమాన్యమైన ప్రతిభతో ప్రతిష్టాత్మక ఢిల్లీ శ్రీరామ్ లేడీ కాలేజ్‌లో సీటు సంపాదించుకుంది. అయితే ఆర్థిక ఇబ్బందులతో అక్కడికి పంపించడం అసాధ్యమని తల్లిదండ్రులు వెనకడుగు వేశారు. అందుకయ్యే ఖర్చు మొత్తం భరిస్తామని కొందరు తెలిసిన వ్యక్తులు హామీ ఇచ్చారు. దీంతో కుటుంబీకులు ఐశ్వర్యను ఢిల్లీకి పంపించారు. అక్కడ కాలేజీ ఫ్రీ హాస్టల్ లో ఉంటూ డిగ్రీ సెకండియర్ చదువుతోంది.
https://10tv.in/telangana-college-student-aishwarya-died-allegedly-by-suicide/
ఓవైపు ఆర్థిక సమస్యలు, మరోవైపు తండ్రి అనారోగ్యం:
సీన్‌కట్‌ చేస్తే… కరోనా నేపథ్యంలో ఇంటికి వచ్చిన ఐశ్వర్యకు…కాలేజీ వసతి గృహం నుంచి ఖాళీ చేయాలంటూ ఓ మెసేజ్‌ వచ్చింది. అక్కడ ఖాళీ చేసి మరోచోట ఉండాలంటే డబ్బు కావాలి. కుటుంబ పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో అప్పుల కోసం, ఆర్థిక సహాయం కోసం ఆ తల్లిదండ్రులు చేయని ప్రయత్నం లేదు. నాడు సాయం చేస్తామన్న వాళ్లు కూడా చేతులెత్తేశారు. ఇదే సమయానికి తండ్రికి కామెర్లు రావడంతో అదనపు ఖర్చులు వేధించాయి. కుటుంబంలో పూట గడవని పరిస్థితి తలెత్తింది. ఐశ్వర్య సందిగ్ధంలో పడింది. తన చదువు కోసం తల్లిదండ్రులు పడుతున్న ఇబ్బందులను ప్రత్యక్షంగా చూసిన ఆమె మనసు వికలమైంది. తన చదువుకు అవకాశాలన్నీ మూసుకుపోయినట్లు భావించింది. దాంతో తన జీవితాన్నే ముగించుకోవాలన్న నిర్ణయానికి వచ్చింది. నవంబర్ 3న ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.



చదువుకి దూరంగా ఉండలేక ఆత్మహత్య:
సూసైడ్‌కు ముందు ఐశ్వర్య తన బాధను సూసైడ్‌ నోట్‌ రూపంలో చెప్పుకుంది. నా వల్ల, నా కుటుంబం చాలా ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటోంది. నేను నా కుటుంబానికి భారం. నా విద్య ఒక భారం. నేను చదువు కొనసాగించలేకపోతే జీవించలేను, నేను చాలా రోజుల నుండి ఆలోచిస్తున్నా.. నాకు చావే కరెక్ట్ అనిపిస్తుంది. కనీసం ఒక ఏడాది అయినా స్కాలర్ షిప్ వచ్చేలా చూడండి అంటూ.. సూసైడ్‌ నోట్‌లో కోరింది.

కాలేజీ యాజమాన్యం తప్పు లేదన్న ఐశ్వర్య తల్లి:
కూతురు బాగా చదివి.. ఉన్నత స్థాయికి వస్తుందనుకున్న తరుణంలో.. ఇలా అర్థాంతరంగా తనువు చాలించడంతో…తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. ఇందులో కాలేజీ యాజమాన్యం తప్పేది లేదని..ఆర్థిక పరిస్థితులే తమ కూతురి ప్రాణం తీశాయని ఐశ్వర్య తల్లి చెబుతున్న మాట. ఇప్పటివరకు ఐశ్వర్య చదువు కోసం నాలుగు లక్షల వరకు ఖర్చు పెట్టామని… ప్రభుత్వం తమకు సాయం చేస్తే మరో కూతుర్ని చదివించుకుంటామని వేడుకుంది.