‘హైదరాబాద్ విద్యార్థులకు డెంగ్యూ, తప్పంతా స్కూళ్లదే’

హైదరాబాద్ వ్యాప్తంగా రెండు నెలలుగా వందకు పైగా విద్యార్థులు డెంగ్యూ బారిన పడుతున్నారు. ముమ్మాటికీ విద్యార్థుల ఆరోగ్యానికి స్కూళ్లే బాధ్యత వహించాలని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పాఠశాలల్లో వెంటిలేషన్ లేకపోవడం దోమలకు వసతి కల్పించనట్లుగా అవుతుందని ఆరోపిస్తున్నారు.
‘రోజు మొత్తంలో విద్యార్థులు దాదాపు 8గంటల పాటు స్కూల్లోనే ఉంటున్నారు. దీంతో అంటువ్యాధులు త్వరగా సోకుతాయి. స్కూళ్లలో శుభ్రత పాటించడం చాలా అవసరం. తెలంగాణాలో ఉన్న 90-95శాతం వరకూ పాఠశాలలు ప్రాథమిక జాగ్రత్తలు కూడా పాటించడం లేదు’ అని హైదరాబాద్ స్కూల్స్ పేరెంట్స్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ వెంకట సాయినాథ్ వెల్లడించారు.
పాఠశాల పరిసరాల్లో దోమలు ఉండకుండా చూసుకోవాలి. వారానికి రెండు సార్లు దోమలు నాశనం అయ్యే మందులు చల్లుతూ ఉండాలి. డెంగ్యూ, మిగిలిన వైరల్ ఫీవర్లు సోకే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఒకరు మాట్లాడుతూ.. ఇంటిలో 4నుంచి 5గురు సభ్యులు మాత్రమే ఉంటారు. వారి ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవడానికే చాలా కష్టపడతాం. కానీ, ఒక తరగతి గదిలో 40మంది చిన్నారులు ఉంటారు. వారి పట్ల ఇంకెంత అప్రమత్తగా ఉండాలని ప్రశ్నించారు.
మునిసిపల్ కార్పొరేషన్ సహకారంతో చాలా స్కూళ్లు ఫమిగేషన్ గురించి జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. దోమలు కుట్టకుండా మందులు, వాటర్ ప్యూరిఫయ్యర్‌లు, నీటి నిల్వ లేకుండా చూడడం వంటివి చేస్తూనే ఉన్నారని టీఆరెస్ఎమ్ఏ ప్రెసిడెంట్ ఎస్ శ్రీనివాసరెడ్డి అన్నారు.