ఫెడరల్‌ స్టెప్స్‌ : చెన్నై వెళ్లిన కేసీఆర్

  • Published By: madhu ,Published On : May 13, 2019 / 12:50 AM IST
ఫెడరల్‌ స్టెప్స్‌ : చెన్నై వెళ్లిన కేసీఆర్

Updated On : May 13, 2019 / 12:50 AM IST

జాతీయస్థాయిలో కీలకపాత్ర పోషించే దిశగా TRS అడుగులు వేస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి KCR ఫెడరల్‌ ఫ్రంట్ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఇప్పటికే పలువురు నేతలతో ఫ్రంట్‌ ఏర్పాటుపై చర్చలు జరిపిన కేసీఆర్.. మరోమారు చెన్నై వెళ్లారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు రాకముందే తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఇటీవలే కేరళ వెళ్లి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తో చర్చించారు. ఎన్నికలు జరిగిన తీరు, భవిష్యత్ రాజకీయాలు, ఫెడరల్‌ ఫ్రంట్‌పై చర్చించారు. ఈ పర్యటన సమయంలోనే తమిళనాడు వెళ్లినప్పటికీ…. స్టాలిన్‌ను కలవకుండానే హైదరాబాద్ చేరుకున్నారు.

మే 12వ తేదీ ఆదివారం ప్రత్యేక విమానంలో చెన్నైకి బయలుదేరారు కేసీఆర్. శ్రీరంగం, తిరుచ్చి ఆలయాలను సందర్శించుకున్నారు. మే 13వ తేదీ సోమవారం సాయంత్రం స్టాలిన్‌తో భేటీ అవుతారని టీఆర్‌ఎస్ వర్గాలు చెబుతున్నాయి. కేసీఆర్‌తో పాటు కొందరు సీనియర్‌ నేతలు కూడా చెన్నై వెళ్లారు. ఫెడరల్ ఫ్రంట్, పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత అనుసరించాల్సిన వ్యూహాలు,  కేంద్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటులో ప్రాంతీయ పార్టీలు అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్- స్టాలిన్ చర్చిస్తారు.

గతేడాది ఏప్రిల్‌లో చెన్నై వచ్చిన కేసీఆర్ అప్పుడు డీఎంకే అధినేత కరుణానిధిని పరామర్శించారు. స్టాలిన్‌తోనూ ఫ్రంట్‌పై చర్చించారు. తర్వాత ఆగస్టులో కరుణానిధి అంత్యక్రియలకు హాజరయ్యారు. నిజానికి కేసీఆర్… చెన్నై వెళ్లరన్న ప్రచారం జరిగింది. అందుకే తమిళనాడు నుంచి నేరుగా హైదరాబాద్ వచ్చేశారు. మళ్లీ 24 గంటలు కూడా గడవకముందే చెన్నై బయలుదేరారు.

కాంగ్రెస్, బీజేపీలకు ఈసారి సొంతంగా మెజారిటీ స్థానాలు వచ్చే అవకాశం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీంతో ప్రాంతీయ పార్టీల పాత్ర కీలకం కానుంది. ఈ నేపథ్యంలో ప్రాంతీయ పార్టీల నేతలను సంఘటితం చేసే పనిలో పడ్డారు కేసీఆర్. కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామితోనూ కేసీఆర్ టచ్‌లో ఉన్నారు. నాలుగైదు రోజుల్లో కేసీఆర్ బెంగళూరు కూడా వెళ్లే అవకాశం ఉంది.