ఎలక్షన్ అలర్ట్ : రెండు రోజులు మద్యం షాప్స్ బంద్

హైదరాబాద్ : ఎన్నికల నేపథ్యంలో మద్యం విక్రయాలపై ఎన్నికల సంఘం నిఘా పెంచింది. ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుండడంతో ఓటర్లను మద్యంతో మభ్యపెట్టే ప్రయత్నాలు జరగకుండా చర్యలు చేపట్టాలని ఆబ్కారీ శాఖను ఆదేశించింది. ఈసీ ఆదేశాల మేరకు ఆబ్కారీ నిఘా పెంచింది.
ఈ క్రమంలో మంగళవారం (ఏప్రిల్ 9) సాయంత్రం 6 నుంచి గురువారం సాయంత్రం 6గంటల వరకు మద్యం షాపులను మూసివేయాలని ఆబ్కారీ అధికారులు ఆదేశించారు. వైన్‌షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లు, పబ్బులు, క్లబ్బులు, వంటివి అంటే మద్యం సరఫరాచేసే హోటళ్లకు ఈ ఆదేశాలు వర్తిస్తాయని అధికారులు స్పష్టం చేశారు. ఈ ఆదేశాలను పాటించకుండా అతిక్రమిస్తే వారి లైసెన్స్‌లను రద్దు చేయడంతో పాటు ఎన్నికల నియమావళి ఉల్లంఘన చట్టం ప్రకారం కేసులు నమోదు చేస్తామని ఆబ్కారీ, పోలీసు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.అలాగే బెల్టుషాపుల్లో మద్యం విక్రయిస్తే జైలు శిక్ష తప్పదని తీవ్రంగా హెచ్చరించారు.