GHMC ఉద్యోగుల ఫ్యామిలీలకు హెల్త్ ఇన్సూరెన్స్

  • Published By: veegamteam ,Published On : October 20, 2019 / 03:06 AM IST
GHMC ఉద్యోగుల ఫ్యామిలీలకు హెల్త్ ఇన్సూరెన్స్

Updated On : October 20, 2019 / 3:06 AM IST

GHMC ఉద్యోగులకు గుడ్ న్యూస్. GHMCలోని 5వేల 516 మంది శాశ్వత ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు వైద్య బీమా సౌకర్యాన్ని కల్పించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగి కుటుంబంలో ఆరుగురికి ఈ పథకాన్ని వర్తింపచేయనున్నారు. నవంబర్ 1 నుంచి ఈ పథకం అమలులోకి వస్తుందని తెలిపారు. ఒక్కొక్కరికి మూడు లక్షల రూపాయల వరకు వైద్య చికిత్సలు పొందేందుకు ఈ పథకం అవకాశం కల్పిస్తుందని చెప్పారు. ఉద్యోగులంతా తమ కుటుంబసభ్యుల వివరాలను ఈనెలాఖర్లోగా అందించాలని GHMC కమిషనర్ లోకేష్ కుమార్ సూచించారు. అలాగే ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ప్రమాదబీమా సౌకర్యాన్నికల్పించనున్నారు. దీనికోసం అధికారులు, ఉద్యోగుల ప్రతినిధులతో రెండు కమిటీలను ఏర్పాటు చేశారు. 

ఇంతకాలం శాశ్వత ఉద్యోగులు తమ సొంత ఖర్చుతో వైద్యం చేయించుకొని ఆ మొత్తాన్ని రీయింబర్స్ చేసుకునే సౌకర్యం పొందుతుండగా, ఇక ముందు వారు ఎటువంటి సొమ్ము చెల్లించకుండానే వైద్యసేవలు పొందేందుకు బీమా సౌకర్యం వీలు కల్పిస్తుందని అధికారులు తెలిపారు. దీనిపై వివిధ బీమా సంస్థలతో చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించారు.

(అక్టోబర్ 31, 2019)లోగా బీమా సౌకర్యంపై తమ సమ్మతి తెలియజేయాలని ఉద్యోగులను కోరారు. ఉద్యోగి, అతని కుటుంబంతోపాటు తల్లి, తండ్రి కలుపుకొని ఐదుగురు సభ్యులు (1+5) రూ. మూడు నుంచి ఆరు లక్షల వరకు ఉచితంగా వైద్య సేవలు పొందే విధంగా ఈ బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు తెలిపారు. ఉద్యోగులు ఎంతోకాలంగా తమకు హెల్త్‌కార్డులు ఇవ్వాలని కోరుతున్న విషయం విదితమే. ఈ క్రమంలో ఇప్పుడు జీహెచ్‌ఎంసీ వారికి ఉచిత వైద్య సౌకర్యం కల్పించే దిశగా బీమా సౌకర్యాన్ని కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తుండడం విశేషం. 

దీంతోపాటు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు సైతం యాక్సిడెంటల్ బీమా సౌకర్యాన్ని కల్పించేందుకు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ప్రమాదవశాత్తూ మరణిస్తే రూ. 8 లక్షలు నష్ట పరిహారం అందించనున్నట్లు, పాక్షికంగా, శాశ్వతంగా వైకల్యం పొందినవారికి కూడా ఈ బీమా సౌకర్యం వర్తిస్తుందని అధికారులు చెప్పారు. అయితే దేనికి ఎంత చెల్లించాలనే విషయంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని తెలిపారు.