జనసేనలో చీలిక: కొత్తగా పార్టీ పెట్టిన నాయకుడు

తెలంగాణ రాష్ట్రంలో మరో కొత్త పార్టీ అవతరించింది. నవ శాఖానికి నాంధి పలుకుతూ “జన శంఖారావం” పేరుతో తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షం చతికిల పడుతున్న తరుణంలో నూతన పార్టీ పెట్టారు. జన శంఖారావం పేరుతో వెనుకబడ్డ వర్గాల ఆత్మాభిమానం, అభివృద్ధి, ఆకాంక్షల కొరకు పార్టీ స్థాపిస్తున్నట్లుగా ప్రకటించారు ఆ పార్టీ అధ్యక్షులు పర్దిపూర్ నర్సింహ.
స్వాతంత్ర్యం వచ్చి 72 సంవత్సరాలు గడిచినా వెనుక బడ్డ వర్గాల వారికి పదవులను నామమాత్రంగానే ఇచ్చారంటూ ఈ మేరకు పార్టీ పెడుతున్నట్లు ప్రకటించారు. విద్య, ఉద్యోగ, రాజకీయంగా వెనుక బడిన వర్గాలను పాలక వర్గం కోటాకే పరిమితం చేస్తుందన్నారు. దేశ ఉన్నతిని కోరుకుని ముందడుగు వేసే వెనుకబడ్డ పౌరులకు జన శంఖారావం పార్టీ వేదికగా నిలుస్తుందని యువతను ఆహ్వానించారు.
పత్రికా ప్రకటనలో పార్టీ కార్యవర్గాన్ని కూడా ప్రకటించారు అధ్యక్షులు పర్దిపూర్ నర్సింహ. పార్టీ ఉపాధ్యకుడిగా వినోద్ ఖన్నా యాదవ్ , ప్రధాన కార్యదర్శిగా కంటేకర్ రాంజీ , కోశాధికారిగా బి.నాగరాజు గుప్తా, ఉమ్మడి కార్యదర్శిగా ఎ. గణేష్ రెడ్డి, నిర్వహరణ కార్యదర్శులుగా జి.సాయి కిషోర్, ఎం. రవి ముదిరాజ్, కార్యనిర్వాహకులు – జె.అవినాష్(చింటు), ఎస్. శ్రీ శైలం యాదవ్ పేర్లను పత్రికా ప్రకటనలో వెల్లడించారు.
గతంలో పర్దిపూర్ నర్సింహ ప్రజారాజ్యం, జనసేన పార్టీ ప్రధాన నేతల్లో ఒకరిగా ఉన్నారు. పవన్ కళ్యాణ్‌కి అత్యంత సన్నిహితుడిగా ఇరు రాష్ట్రాల్లో పేరు పొందారు జన శంఖారావం పార్టీ అధ్యక్షులు పర్దిపూర్ నర్సింహ. తెలంగాణలో వెనుకబడ్డ వర్గాల ఉనికిని చాటేందుకే పార్టీ స్థాపించారంటూ అనుచరులు చెబుతున్నారు.