ముందు ప్రజలను బతికించుకొందం…ఆ తర్వాత ఆర్ధికవ్యవస్థ గురించి ఆలోచిద్దాం… రెండు వారాల లాక్ డౌన్ తప్పదు…

  • Published By: chvmurthy ,Published On : April 6, 2020 / 03:46 PM IST
ముందు ప్రజలను బతికించుకొందం…ఆ తర్వాత ఆర్ధికవ్యవస్థ గురించి ఆలోచిద్దాం… రెండు వారాల లాక్ డౌన్ తప్పదు…

Updated On : April 6, 2020 / 3:46 PM IST

పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా తెలంగాణ సీఎం కీలక నిర్ణయం తీసుకున్నారు. లాక్‌డౌన్ ను మరో రెండువారాలు కొనసాగించాలని ప్రధానిని కోరారు. అమెరికాలాంటి అన్నిశక్తియుక్తులన్న దేశమే శవాల గుట్టగా మారిపోయిననప్పుడు… మనలాంటి దేశానికి లాక్‌డౌనే కరోనా కట్టడికి పరిష్కారమని అన్నారు కేసిఆర్. ప్రెస్‌మీట్‌లో ఇంకా ఏమన్నారంటే…

లాక్‌డౌన్ తప్ప గత్యంతరంలేదు. మోడీ అడిగితే కొనసాగించమని చెప్పా. 
విదేశాల నుంచి వచ్చిన వ్యాధికాబట్టి, విమానాశ్రాయాలు, పోర్టులు మూసేశాం. జనాతా కర్ఫ్యూ, లాక్‌డౌన్‌తో కట్టడి చేశాం. దేశం విజయవంతమైంది. దేశం సేఫ్. అదే అమెరికాలో శవాలు గుట్టలు పేరుకొంటున్నాయి. హృదయవిదాకరమైన వార్తలు వింటున్నాం. శవాలను ట్రక్కు‌ల్లో పంపుతున్నారు. దయనీయం. అంత పవరువున్న దేశమే అల్లల్లాడింది. అలాంటి పరిస్థితి మనకు వచ్చుంటే కోట్లలో చనిపోయేవాళ్లు.

లాక్‌డౌన్‌లో భాగంలో ప్రజలు సహకరించారు. ఇది మానవజాతికి పట్టిన పీడ. సంక్షోభం. 22 దేశాలు లాక్‌డౌన్‌లో ఉన్నాయి. జపాన్, సింగపూర్, పోలండ్, బ్రటన్, జర్మనీ, పెరు, దక్షిణాఫ్రికా, నెదర్లాండ్, నేపాల్ లాంటి దేశాలు కంప్లీట్ లాక్‌డౌన్. 90 దేశాల్లో పాక్షికంగా లాక్‌డౌన్ ఉంది. నిజానికి, ఇది మంచి నిర్ణయం. ఇంతమందిని రక్షించుకున్నామంటే కారణం లాక్‌డౌన్. అమెరికాలాంటి దేశమే అతలాకుతలమైపోయింది.  

BCGఇచ్చిన రిపోర్ట్ ప్రకారం జూన్ 3నాటికి కరోనా పీక్‌కెళ్తుంది. చేరుతుంది. ఇదో హెచ్చరిక. అందుకే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనలాంటి దేశానికి లాక్‌డౌన్ పాటించడం తప్ప మరో గత్యంతరం లేదు. ఎకానమి దెబ్బతింటుంది. అయినా తప్పదు. తెలంగాణకు రోజుకు రూ.450 కోట్ల వరకు ఆదాయమొస్తుంది. ఈ ఆరు రోజుల్లో 2400కోట్లు రావాలి. వచ్చింది ఆరుకోట్లు. మార్చి 15తర్వాత ఆదాయం జీరో. అయినా తప్పదు.

అందుకే లాక్ డౌన్ మినహా మరో ప్రత్యమ్నాయం లేదు. అందుకే లాక్ డౌన్ ను కొనసాగించండని ప్రధాని మోడీకి నేనే చెప్పా. లాక్‌డౌన్ ఎత్తేస్తే మళ్లీ ఆగమవుతాం. కరోనా నియంత్రణలోకి రాకుండా లాక్ డౌన్ ఎత్తివేస్తే పరిస్థితి మళ్లీ మొదటకు వస్తుందని, జనం గుంపులా బైటకొస్తారన్నఆందోళన కేసిఆర్‌ది.

తెలంగాణలో 364 కేసులు. 11 మంది మృతి
“మొదటి విడతలో, విదేశాల నుంచి వచ్చినవారిలో  25,935ల మందిని క్వారంటీన్ చేశాం. అందులో 50 మందికి పాజిటీవ్. 30 మంది విదేశాల నుంచి మోసుకొచ్చారు. మిగిలిన వారు వాళ్ల కుటుంబ సభ్యులు. అందరూ కోలుకున్నారు. 35 మంది డిశ్చార్జ్ అయ్యారు. మిగిలిన వాళ్లూ డిశ్చార్జ్ అవుతారు. వీళ్లంతా ఫస్ట్ స్టేజ్. రేపటికి వాళ్లంతా ఇంటికెళ్లతారన్నారు” కేసీఆర్. ఢిల్లీ ఘటన తర్వాత పరిస్థితి ఒక్కసారిగా తారుమారైంది.

మొత్తం మీద 364కి పాజిటీవ్ వచ్చింది. 45 మంది డిశ్చార్జ్ అయితే, 11 మంది చనిపోయారు. 308 మంది గాంధీ హాస్పటల్ లో ట్రీట్ మెంట్ లో ఉన్నారు. ఢిల్లీకెళ్లినవాళ్లు 1,089 మంది తెలంగాణకొచ్చారు. వీళ్లలో 172 మందికి పాజిటీవ్.  ఇందులోనే 11 మంది చనిపోయారు. వీళ్ల నుంచి మరో 93 మందికి సోకింది. మొత్తం మీద 3015 మందిలో కొందరు హిందువులున్నారు.  600 మందికి టెస్ట్ లు జరుగుతున్నాయి. మూడురోజుల్లో టెస్ట్ లు పూర్తవుతాయి.

ప్రధానితో రోజుకు రెండుసార్లు మాట్లాడుతున్నా. పరిస్థితిని అధిగమించడానికి చర్చించాం. ఇంతకుముందెన్నడూ ఇలాంటి సందర్భంలేదు. బైటకు రానివ్వట్లేదని బాధపడడొద్దు. మోడీగారు అడిగే లాక్ డౌన్ ను కొనసాగించాల్సిందేనని చెప్పాను. బతికుంటే బలుసాకు తినొచ్చు. మొత్తం దుకాణమే బందయ్యింది. జీతాలు ఎక్కడనుంచి తీసుకురావాలి? అప్పులు చేయాల్సిందే. ఇదే విషయాన్ని ప్రధానితో మాట్లాడతాను. దేశం ముందు లాక్ డౌన్ మినహా గత్యంతరంలేదు. ఆర్ధిక వ్యవస్థను పునరుద్ధరించుకోవచ్చు. ప్రాణాలను తిరిగి తేలేం కదా. ఈ విషాదాన్ని నాగరిక సమాజం భరించజాలదని అన్నారు సిఎం కేసీఆర్.

వైద్యసిబ్బంది అందరికీ పాదాభివందనం
“కరోనాపై పోరులో అందరికి మించి ప్రాణాలకు తెగించి వైద్యసిబ్బంది పనిచేస్తున్నారు. కరోనా సోకే ప్రమాదముందని తెలుసు. అయినా వాళ్లు ధైర్యంగా పనిచేస్తున్నారు. ఆస్పత్రిలో స్వీపర్ నుంచి డైరెక్టర్ వరకు రాష్ట్రంలోని వైద్య సిబ్బంది  అందరికీ రాష్ట్రప్రజల తరపున నేను రెండు చేతులెత్తి దండం పెడుతున్నా. వారికి పాదాభివందనం. వాళ్లు గొప్పవాళ్లు. వాళ్లకు ఎంత దండం పెట్టినా తక్కువ.”  (TCS బంపరాఫర్: Lockdown టైంలో ఫ్రీ కోర్సు)
 
వైద్యసిబ్బందికి సిఎం గిఫ్ట్

కరోనా కట్టడిలో ముందుండిపోరాడుతున్న వైద్యసిబ్బంది చేస్తున్న పని అద్భుతమన్నారు సిఎం కేసీఆర్. “కొవిడ్19 వైరస్ పోరాడుతునన వైద్యశాఖ సిబ్బందికి పూర్తి వేతనమివ్వాలని చెప్పాం. వారి సేవలకు గుర్తుగా, సిఎం గిఫ్ట్ కింద వాళ్లందరికీ 10శాతం గ్రాస్ శాలరీనిస్తున్నాం. ఆర్ధిక కార్యదర్శితో మాట్లాడాం. వాళ్లకు వెంటనే డబ్బు అందచేస్తాం. ఈ మేరకు జీవో రిలీజ్ చేస్తాం. పోలీసు సిబ్బందికూడా బాగా పనిచేస్తున్నారు. ధన్యవాదాలు.” కేసీఆర్

GHMC, HMWS సిబ్బందికి రూ.7500 ప్రోత్సాహం
ప్రతి వీధిని, గల్లీ, గల్లీ తిరిగి రసాయనాలు పిచికారీచేసి, నగరాన్ని జీహెచ్ ఎంసీ, హెచ్ ఎం డబ్ల్యూ సిబ్బంది, సఫాయి కర్మచారిలు అద్దంగా ఉంచుతున్నారు. వీళ్లంతా 95,392 మంది. వీళ్లకు జీతంలో మొన్న కోత పెట్టాం. ఈ మొత్తాన్ని ఒకట్రెండ్ రోజుల్లో ఇస్తాం. అలాగే ప్రత్యేక ప్రోత్సాహ నిధి కింద  GHMC, HMWS సిబ్బందికి రూ.7500 ప్రత్యేక ప్రోత్సాహకంగా ఇస్తాం. మున్సిపాలిటీలు, గ్రామ పారిశుద్ధ్య కార్మికులకు రూ.5000 చొప్పున ఇస్తాం. సఫాయి అన్నా…నీకు సలాం అన్నా. ఇదే స్ఫూర్తిగా పనిచేయండి. మీకు గుర్తింపు ఉంటుందని అన్నారు సీఎం కేసీఆర్.