యురేనియం తవ్వకాలపై సీఎం కేసీఆర్ కీలక ప్రకటన

యురేనియం తవ్వకాలపై సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఈ అంశాన్ని ప్రస్తావించారు. సెప్టెంబర్ 15వ తేదీ ఆదివారం బడ్జెట్‌పై ఆయన సమాధానం ఇచ్చారు. యురేనియం తవ్వకాలపై పలువురు సభ్యులు ప్రస్తావించిన విషయాన్ని గుర్తు చేశారు. యురేనియం తవ్వకాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత..ఎవరికీ ఎలాంటి పర్మిషన్ ఇవ్వలేదని స్పష్టం చేశారు. భవిష్యత్‌లో ఇచ్చే ఆలోచన కూడా లేదని తేల్చిచెప్పారు. ఈ అంశంపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు సీఎం కేసీఆర్. ఎలాంటి పరిస్థితుల్లో నల్లమల్ల అడవులు నాశనం కానివ్వమని సభలో వెల్లడించారు.
అయితే..వద్దని చెప్పినా..గతంలో అనుమతులు ఇచ్చింది కాంగ్రెస్ అని చెప్పారు. 2009లో ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణలో, ఏపీలో కూడా అనుమతులు ఇచ్చారన్నారు. కడపలో తవ్వకాలు జరుగుతున్నాయని, కలుషితం అయిపోతోందనే వార్తలు వస్తున్నాయని సభకు తెలిపారు. కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులు (శ్రీశైలం, సాగర్, పులిచింతల, డెల్టా) మొత్తం కలుషితమై నాశనమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కోట్ల మంది ప్రజలు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలున్నాయన్నారు. దీని నుంచి హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్ సమస్య ఉందని, రాజధానికి కూడా ప్రమాదం ఉందన్నారు.
వీటన్నింటి దృష్ట్యా యురేనియం అనుమతులివ్వని మరోసారి సభకు స్పష్టం చెప్పారు. అందరం కలిసి కేంద్రంతో పోరాటం చేద్దామని, ఇందుకు సభ ఒక తీర్మానం పాస్ చేసే ఆలోచన ఉందన్నారు సీఎం కేసీఆర్.
నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలకు సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో ఉద్యమం నడుస్తోంది. కేంద్రం నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. అడవులను కాపాడాలని డిమాండ్ చేస్తున్నారు. సెలబ్రిటీలు, పొలిటికల్ లీడర్లు దీనిపై గళమెత్తుతున్నారు. దీనిపై మంత్రి కేటీఆర్ స్పందించారు. యురేనియం నిక్షేపాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని కేటీఆర్ చెప్పారు. శాసనమండలిలో ఈ ప్రకటన చేశారు మంత్రి కేటీఆర్.
Read More : మొత్తం ప్రభుత్వ ఉద్యోగాలు ఏ ప్రభుత్వం ఇవ్వదు – సీఎం కేసీఆర్