తెలంగాణ బ్రాండ్‌ : రాష్ట్ర ప్రతిష్ట కోసం కేసీఆర్ నిర్ణయాలు

  • Published By: madhu ,Published On : January 27, 2019 / 01:44 PM IST
తెలంగాణ బ్రాండ్‌ : రాష్ట్ర ప్రతిష్ట కోసం కేసీఆర్ నిర్ణయాలు

Updated On : January 27, 2019 / 1:44 PM IST

హైదరాబాద్ : రాష్ట్రంలో పండిస్తున్న వ్యవసాయ ఉత్పత్తులకు తెలంగాణ బ్రాండ్‌ సృష్టించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ సర్కార్‌ నిర్ణయించింది. ఇప్పటికే మామిడి పండ్లను తెలంగాణ బ్రాండ్‌ పేరుతో విదేశాలకు ఎగుమతి చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్న అధికారులు… ఇప్పుడు బియ్యానికి కూడా తెలంగాణ బ్రాండ్‌ ఇమేజ్‌ తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు. తద్వారా అటు రైతులకు మేలు జరగడంతోపాటు ఇటు రాష్ట్ర ప్రతిష్ట ఇనుమడిస్తుందని పాలకులు భావిస్తున్నారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా తెలంగాణ బ్రాండ్‌ వ్యవసాయ ఉత్పత్తులు వెల్లువెత్తనున్నాయి. బియ్యంతో పాటు రాష్ట్రంలో పండుతున్న అన్ని పంటలకు తెలంగాణ బ్రాండ్‌ ఇమేజ్‌ కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌ సర్కార్‌ ప్రయత్నిస్తోంది. రాష్ట్రంలో పండుతున్నమామిడి పండ్లను తెలంగాణ బ్రాండ్‌ పేరుతో దేశంలోని ఇతర రాష్ట్రాలతోపాటు విదేశాలకు ఎగుమతిచేసేందుకు  వ్యవసాయ, మార్కెటింగ్‌శాఖ ప్రణాళికలు రూపొందిస్తుంది. ఇందు కోసం పక్వానికి వచ్చిన మామిడి పండ్లను వాటర్‌ వేపర్‌ హీట్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ద్వారా శుద్ధిచేసి.. దేశ, విదేశాలకు ఎగుమతి చేసేందుకు చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో పెంచుతున్న చేపలు, రొయ్యలకు కూడా తెలంగాణ బ్రాండ్‌ ఇమేజ్‌ తీసుకు వచ్చేందుకు ఉన్న అవకాశాలను మత్స్య శాఖ  అధికారులు పరిశీలిస్తున్నారు.  ఈ సీజన్‌ నుంచి ఈ ప్రక్రియను ప్రారంభించేందుకు ప్రణాళికులు సిద్ధం చేస్తున్నారు. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి రాష్ట్ర ప్రభుత్వం.. బియ్యానికి కూడా తెలంగాణ బ్రాండ్‌ ఇమేజ్‌ తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టింది. 

రాష్ట్రంలో ఏటేటా పెరుగుతున్న  వరి సాగు విస్తీర్ణం 
ధాన్యం దిగుబడి గణనీయంగా పెరిగే అవకాశం 
మార్కెటింగ్‌, ధరల సమస్యలు తలెత్తకుండా చర్యలు 

తెలంగాణ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని శరవేగంగా పూర్తిచేస్తుండటంతో..  ఏటేటా కొత్త ఆయకట్టు సాగులోకి వస్తోంది. వరిసాగు విస్తీర్ణం పెరుగుతోంది. ధాన్యం దిగుబడులు పెరుగుతున్నాయి. సమీప భవిష్యత్‌లోనే వరి సాగు విస్తీర్ణంతో పాటు ధాన్యం దిగుబడి గణనీయంగా పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. దీంతో మార్కెట్‌ సమస్య తలెత్తి, ధరలు పడిపోతే అన్నాదాతలకు కష్టాలు.. ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చే అవకాశం ఉందని పాలకులు భావిస్తున్నారు. దీంతో ఇలాంటి సమస్యలు తలెత్తక ముందే వ్యూహాత్మకంగా వ్యవహరించాలని నిర్ణయించింది. 

రాష్ట్రం నుంచి బియ్యం ఎగుమతులకు ఉన్న అవకాశాలు, సాధ్యాసాధ్యాలపై సుపరిపాలనా సంస్థ…సీజీజీ అధ్యయనం చేసి, ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ముందుగా నాణ్యమైన బియ్యాన్ని తెలంగాణ బ్రాండ్‌ పేరుతో మార్కెట్‌లోకి తీసుకొస్తే మంచిందని సూచింది. రాష్ట్ర  పౌర సరఫరాల సంస్థ.. సూపర్‌ మార్కెట్‌ చైన్‌ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుని తెలంగాణ బ్రాండ్‌ రైస్‌ విక్రయించేందుకు చర్యలు తీసుకోవాలని సిఫారసు చేసింది. రాష్ట్రంలోని రైస్‌ మిల్లర్లలో కొందరు కాకినాడ పోర్ట్‌ ద్వారా విదేశాలకు బియ్యం ఎగుమతి చేస్తున్నారు. ఈ బియ్యాన్ని కూడా తెలంగాణ బ్రాండ్‌ పేరుతో ఎగుమతి చేసేందుకు రైస్‌ మిల్లర్లతో చర్చలు జరపాలని పౌరసరఫరాల సంస్థ నిర్ణయించింది. 

ఇక రాష్ట్రంలోని చౌక ధరల దుకాణాలను కూడా పటిష్టపరచాలని  ప్రభుత్వం నిర్ణయించింది. రేషన్‌ షాపుల్లో ప్రస్తుతం బియ్యాన్ని మాత్రమే సరఫరా చేస్తున్నారు. దీనికి తోడు కందిపప్పు, మినపప్పు, పెసలు, కందులు, శనగలు  విక్రయించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని సీజీజీ సూచించింది. తర్వాత ఇటు రేషన్‌ షాపుల డీలర్లు ఆర్థికంగా నిలదొక్కుకోవడంతోపాటు వినియోగదారులకు నాణ్యమైన పప్పులు లభిస్తాయని నివేదికలో పొందుపరిచింది. 

రాష్ట్రంలో ఉన్న 17,500 చౌకధరల దుకాణాల్లో ముందుగా ఎంపిక చేసిక  రేషన్‌ షాపుల్లో   దీనిని అమలు చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. రాజస్థాన్‌, పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వాలు ప్యూచర్‌ గ్రూప్‌తో ఇలాంటి ఒప్పందం కుదుర్చుకుని రేషన్‌ షాపుల్లో పప్పులను విక్రయిస్తున్న విషయాన్ని సెంటర్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ తన నివేదికలో ప్రస్తావించింది. మొత్తంమీద రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తులకు తెలంగాణ బ్రాండ్‌ తీసుకువచ్చేందుకు ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నించడంపై హర్షం వ్యక్తమవుతోంది.