సూపర్ మార్కెట్లో కాల్పులు.. ఆరుగురు మృతి

సూపర్ మార్కెట్లో కాల్పులు.. ఆరుగురు మృతి

Supermart

Updated On : March 23, 2021 / 8:41 AM IST

అమెరికాలో కాల్పుల ఘటనలు తరచుగా చోటుచేసుకుంటూనే ఉన్నాయి. లేటెస్ట్‌గా కొలరాడోలోని బౌల్డర్‌లో ఓ సూపర్ మార్కెట్లో జరిగిన కాల్పుల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురికి గాయాలయ్యాయి. మృతుల్లో ఓ పోలీస్ అధికారి ఉన్నారు. బౌల్డర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. షర్ట్ లేకుండా గాయాలతో సూపర్ మార్కెట్లో నుంచి బయటకు వచ్చిన వ్యక్తి సమాచారం మేరకు.. లోపల ఓ వ్యక్తి ప్రజలపై కాల్పులకు తెగబడుతున్నాడని తెలుసుకుని చుట్టుపక్కల ఉన్నవారు అక్కడి నుంచి పరుగులు తీశారు.

కాల్పులు జరుపుతున్న వ్యక్తిని పట్టుకునే క్రమంలో ఓ పోలీస్ ఆఫీసర్ లోపలికి వెళ్లగా.. దుండగుడు కాల్పులు జరిపాడని, దీంతో అతను అక్కడికక్కడే చనిపోయినట్లు గుర్తించారు. దీనిపై వైట్ హౌస్ స్పందించింది. దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలని తన బృందానికి తెలిపారు బైడెన్. అయితే కాల్పుల్లో మృతుల సంఖ్య అధికంగా ఉన్నట్లు తెలుస్తుంది.

ఆరుగురు అని చెబుతున్నప్పటికీ లోపల పరిస్థితి వేరేలా ఉందని స్థానిక మీడియా సంస్థలు చెబుతున్నాయి. మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించిన తర్వాతనే మృతుల సంఖ్య, వారి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనపై కొలరాడో గవర్నర్‌ జేర్డ్‌ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ‘బౌల్డర్‌లో జరిగిన విషాదకర ఘటన పట్ల దిగ్బ్రాంతికి గురయ్యా. కింగ్‌ సూపర్స్‌ వద్ద చోటుచేసుకుంటున్న పరిణామాల్ని నేను నిశితంగా గమనిస్తున్నా’ అని జేర్డ్‌ ట్వీట్‌ చేశారు.

అట్లాంటాలోని రెండు వేర్వేరు మసాజ్‌ పార్లర్లపై దుండగులు కాల్పులకు పాల్పడటం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ దాడిలో 8 మంది మరణించగా వారిలో ఆరుగురు ఆసియన్‌ అమెరికన్లే కావడం గమనార్హం. ఈ కాల్పుల ఘటనపై అమెరికాలో భారీగా నిరసనలు వెల్లువెత్తాయి.