దేశ లైబ్రరీల నుంచి ప్రజాస్వామ్యం పుస్తకాలు మాయం, అసలేం జరిగింది

హాంకాంగ్ లో విచిత్ర పరిస్థితి నెలకొంది. ఆ దేశ లైబ్రరీలో పలు పుస్తకాలు మాయం అయ్యాయి. ప్రజాస్వామ్యం గురించి, ప్రజాస్వామ్యం గొప్పదనం గురించి పలువురు వ్యక్తులు రాసిన పుస్తకాలు ల్రైబరీ నుంచి మాయం అయ్యాయి. హాంకాంగ్ సిటీలోని అన్ని లైబ్రరీలలో ఇదే పరిస్థితి. ప్రజాస్వామ్యం గురించి రాసిన పుస్తకాలు ఏవీ కనిపించడం లేదు. ప్రజాస్వామ్యం గురించి రాసిన పుస్తకాలే కాదు ఆన్ లైన్ రికార్డులు కూడా అదృశ్యం అయ్యాయి. హాంకాంగ్ లో జాతీయ భద్రత చట్టాన్ని చైనా అమలు చేసిన మరుసటి రోజు నుంచి ఆ దేశ గ్రంథాలయాల్లో డెమోక్రసీ గురించి రాసిన పుస్తకాలు అదృశ్యం అయ్యాయి.
మాయమైన పుస్తకాల్లో ఎక్కువగా జోషు వాంగ్ అనే రచయిత రాసినవి ఉన్నాయి. జోషు వాంగ్ సిటీకి చెందిన ప్రముఖ కార్యకర్త. అలాగే తాన్యా చాన్ అనే రచయిత రాసిన పుస్తకాలు కూడా కనిపించడం లేదు. తాన్యా చాన్ ప్రముఖ డెమోక్రసీ లా మేకర్. బీజింగ్ కొత్త నేషనల్ సెక్యూరి లా ని మంగళవారం అమలు చేశారు.
ప్రజాస్వామ్యవాదులపై డ్రాగన్ ఉక్కుపాదం:
దీని వెనుక చైనా ప్రభుత్వం హస్తం ఉందని రచయితలు ఆరోపించారు. ఇలాంటి చర్యల వల్ల ప్రజాస్వామ్యం కోసం చేస్తున్న ఉద్యమాలను దెబ్బతీయలేవన్నారు. పైగా మరింత బలోపేతం చేస్తాయన్నారు. వాంగ్, చాన్, చిన్ లు ప్రజాస్వామ్యం గురించి పెద్ద సంఖ్యలు పుస్తకాలు రాశారు. హాంకాంగ్ ప్రజల్లో స్ఫూర్తిని రగిలించారు. ఈ కారణంగానే చైనా ప్రభుత్వం తమపై కక్ష గట్టిందన్నారు. ఈ ముగ్గురు రాసిన పుస్తకాలు చాలావరకు ఇప్పుడు లైబ్రరీలో కనిపించడం లేదు. పుస్తకాల మాయంపై ల్రైబరీ నిర్వాహాకులు స్పందించారు. నేషనల్ సెక్యూరిటీ లా అనుగుణంగా పుస్తకాలను ల్రైబరీ నుంచి తొలగించినట్టు చెప్పారు. ఇకపై ఆ పుస్తకాలు రెఫరెన్స్ కోసం కానీ, చదవడానికి కానీ అందుబాటులో ఉండవని తేల్చి చెప్పారు.
హాంకాంగ్ పై పట్టు కోసం కొత్త చట్టం తెచ్చిన చైనా:
హాంకాంగ్ పై పట్టు కోసం చైనా తెచ్చిన జాతీయ భద్రతా చట్టం అక్కడి జర్నలిస్టులు, లాయర్లు, రచయితలు, ప్రజాస్వామ్య వాదులకు తలనొప్పిగా మారింది. తికమక రేపుతున్న ఈ చట్టంలోని కొన్ని పదాలు, నేరాలకు ఇఛ్చిన నిర్వచనాలు వారిని అయోమయానికి గురి చేస్తున్నాయి. కొన్ని నిర్వచనాలైతే వివక్షకు దారి తీసే విధంగా, నిరంకుశంగా ఉన్నాయని ఐరాస మానవ హక్కుల కార్యాలయమే పెదవి విరిచింది. ఈ ‘లా’ లోని కంటెంట్లను ఈ ఆఫీసు ఇంకా విశ్లేషించే పనిలో ఉండగా.. తాజాగా నిషేధించిన ప్రజాస్వామ్య అనుకూల నినాదాలను తమ వార్తల్లో ప్రస్తావించాలో, లేదో తెలియక జర్నలిస్టులు తలలు పట్టుకుంటున్నారు. విదేశీ రిపోర్టర్లతో సహా నగర మీడియాపైనా, పత్రికా స్వేఛ్చ పైన ఈ చట్టం చూపగల ప్రభావంపై క్లారిటీ ఇవ్వాలని హాంకాంగ్ లోని ‘ఫారిన్ కరస్పాండెంట్స్ క్లబ్’.. నగర చీఫ్ ఎగ్జిక్యూటివ్ క్యారీ లామ్ కి ఓపెన్ లెటర్ రాసింది.
చైనా తెచ్చిన వివాదాస్పద చట్టంపై హాంకాంగ్ లో నిరసనలు:
చైనా తెచ్చిన వివాదాస్పద జాతీయ భద్రతా చట్టంపై హాంకాంగ్ లో నిరసనలు మిన్నంటాయి. చట్టానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనకారులు రోడ్డుపైకి వస్తున్నారు. చైనా చట్టం వల్ల హాంకాంగ్ ప్రాదేశిక స్వయం ప్రతిపత్తి, ప్రజల వ్యక్తిగత స్వేచ్ఛకు తీవ్ర నష్టం వాటిల్లుతుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ప్రజాస్వామ్య అనుకూల వాదులు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
ఏమిటీ చట్టం.. ఎందుకీ ఆందోళనలు?
ప్రబల ఆర్థిక శక్తి అయిన హాంకాంగ్ ప్రస్తుతం చైనాలో ప్రత్యేక పాలనా వ్యవస్థ (ఎస్‌ఏఆర్)గా ఉంది. 1997 జులై 1న ఈ ప్రాంతం.. బ్రిటన్ నుంచి చైనా అధీనంలోకి వచ్చింది. నాటి నుంచి ‘ఒక దేశం, రెండు వ్యవస్థలు’ అనే విధానం ఇక్కడ అమల్లో ఉంది. దీని ప్రకారం చైనాలోని మిగతా ప్రాంతాల్లో లేని కొన్ని రకాల స్వేచ్ఛలను హాంకాంగ్‌లో పొందొచ్చు. ఇక్కడ పరిమిత స్థాయిలో ప్రజాస్వామ్యం, పౌర హక్కులు అమల్లో ఉంటాయి.
హాంకాంగ్ ప్రత్యేక పాలనా ప్రాంతం (హెచ్‌కేఎస్‌ఏఆర్)లో న్యాయ వ్యవస్థ, భద్రతా వ్యవస్థలను ఏర్పాటు చేయడంతోపాటు వాటిని మెరుగుపరచడానికి ఈ బిల్లును తెస్తున్నట్లు చైనా తెలిపింది. హాంకాంగ్ ప్రాంతంలో చేపట్టే దేశద్రోహం, వేర్పాటువాద, విద్రోహ చర్యలు, విదేశీ జోక్యం, ఉగ్రవాదాన్ని నిషేధించడానికి ఈ చట్టం వీలు కల్పిస్తుందని అంటున్నారు.