పగలే చీకట్లు : ఆస్ట్రేలియా అడవుల్లో నిమిషాల్లో మారిన వాతావరణం

  • Published By: chvmurthy ,Published On : February 2, 2020 / 09:52 AM IST
పగలే చీకట్లు : ఆస్ట్రేలియా అడవుల్లో నిమిషాల్లో మారిన వాతావరణం

Updated On : February 2, 2020 / 9:52 AM IST

ఆస్ట్రేలియా అడవుల్లో మొదలైన దావాగ్నికి భారీ వృక్షాలు సైతం కాలి బూడిదవుతున్నాయి. అనేక ప్రాణులు తమ ఆవాసాల్ని, ప్రాణాల్ని కోల్పోతున్నాయి. ఆస్ట్రేలియాలోని అడవిలో మొదలైన కార్చిచ్చు క్షణాల్లో పగటిపూటను చీకటిగా మార్చేస్తోంది. అడవిలోని పొదలకు నిప్పు అంటుకుని దానికి గాలి తోడై విపరీతమైన పొగ ఏర్పడటంతో పగటి పూటే చీకట్లు ముసురుకుంటున్నాయి.
 

డన్మోర్ అగ్మిమాపక శాఖ ఫేస్ బుక్ లో పోస్టు చేసిన వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది.  అగ్నిమాపక శాఖ పోస్టు చేసిన ఈవీడియోలో కొద్ది నిమిషాల్లో  జరగబోయే ప్రమాదాన్ని ఊహించి సిబ్బంది మంటల మధ్యలోంచి ఎలా తప్పించుకున్నారో తెలుస్తుంది. మంటలు పెరిగే కొద్దీ  పొగతో వాతావరణం చీకట్లు అలుముకుంది. మంటలు వ్యాపిస్తున్నప్పుడు మంటలు, పొగ మధ్యలోంచి, అడవిలోని చెట్లమధ్య నుంచి అగ్నిమాపకశాఖ వాహానం ప్రమాదం నుంచి బయటపడింది.  
 

ఈ వీడియో ఫేస్ బుక్ లో పోస్టు చేసినప్పటి నుంచి సుమారు 1.4 మిలియన్ల మంది వీక్షించారు. 22వేల మంది షేర్ చేశారు. మరో 10 వేల మంది లైక్ చేశారు. 3వేల మందికి పైగా కామెంట్లు పెట్టారు. కొందరు అగ్నిమాపక సిబ్బంది ధైర్యాన్ని మెచ్చుకున్నారు. కేవలం కొద్ది నిమిషాల్లో ప్రాణాలు కాపాడుకున్న సిబ్బందిని ప్రశంసించారు. అగ్నిమాపకశాఖ ఈ వీడియో ఫుటేజిని పోస్ట్ చేయటం చాలా మంచి పనైందని కొందరు నెటిజన్లు కామెంట్లు పెట్టారు.
 

అగ్ని ఎంత వేగంగా వ్యాప్తి చెందుతుందో ఈ ఫుటేజిలో తెలుస్తోందని..తద్వారా ప్రజలు ఎంత అప్రమత్తంగా ఉండాలో తెలుపుతోందని అన్నారు. ఆస్ట్రేలియాలో గతంలో ఏడాది ఒకసారే అడవులు అంటుకోవటం జరిగేది కానీ ఇప్పుడు ఇది  పరిపాటి అయ్యింది. సెప్టెంబర్ లోని ఎండాకాలంలో దాదాపు 26.2 మిలియన్ ఎకరాలు అగ్నికి ఆహుతయ్యింది.