ఫేస్‌బుక్ కీలక నిర్ణయం : క్విజ్ యాప్‌లపై నిషేధం

కేంబ్రిడ్జ్ అనలిటికా డేటా స్కాండల్ తర్వాత సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ అలర్ట్ అయ్యింది. మరోసారి తప్పిదాలు జరక్కుండా చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఫేస్ బుక్ కీలక నిర్ణయం తీసుకుంది. క్విజ్ యాప్ లపై నిషేధం విధించింది. యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని పరిరక్షించేందుకు ఈ చర్యలు తీసుకున్నట్టు తెలిపింది. ఫేస్ బుక్ ప్లాట్‌ఫామ్‌లో యూజర్ల వ్యక్తిత్వంపై క్విజ్‌లను నిర్వహించే యాప్‌లను నిషేధిస్తున్నామని చెప్పింది. యూజర్ల సమాచారాన్ని రహస్యంగా సేకరించేలా ఉన్న యాప్‌లకు చెక్ పెట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించింది.
వీటితోపాటు పలు అప్లికేషన్ ప్రొగ్రామింగ్ ఇంటర్ ఫేస్‌ల(ఏపీఐ)ను తొలగిస్తున్నామని చెప్పింది. కేంబ్రిడ్జి అనలిటికా సంస్థ ఫేస్‌బుక్ నుంచి 8.7 కోట్ల మంది అమెరికన్ల వ్యక్తిగత సమాచారాన్ని చోరీ చేసిన సంగతి తెలిసిందే. 2016లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఈ సమాచారాన్ని వాడుకున్నట్లు తేలడంతో ఫేస్‌బుక్ నష్టనివారణ చర్యలు చేపట్టింది. కేంబ్రిడ్జి అనలిటికా కారణంగా ఫేస్ బుక్ తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఫేస్‌బుక్ ఖాతాదారుల వ్యక్తిగత సమాచారాన్ని దొంగలించడం కలకలం రేపింది. ఫేస్ బుక్ ఎంతవరకు సేఫ్ అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. దీంతో అప్రమత్తమైన ఫేస్ బుక్ యూజర్ల పర్సనల్ డేటా భద్రతపై ఫోకస్ పెట్టింది.