పోలీసు అధికారి ప్రాణం తీసిన కోడిపుంజు..!!

Philippines : ఓ కోడిపుంజు ఏకంగా ఓ పోలీసు అధికారి ప్రాణం తీసింది. అదేంటీ కోడేంటీ..పోలీసు అధికారిని ప్రాణాలు తీయటమేంటీ అని ఆశ్యర్యం కలుగుతుంది. కానీ డ్యూటీలో ఉన్న పోలీసు అధికారి ప్రాణాలు పోవటానికి ఓ కోడిపుంజు కారణమైన ఘటన ఫిలిప్పీన్స్ లో చోటుచేసుకుంది.
కోడిపందాలు అంటే సంక్రాంతి పండుగ..భారతదేశంలోని ఏపీ రాష్ట్రంలోని గోదావరి జిల్లాలు గుర్తుకొస్తాయి. కానీ కేవలం గోదావరి జిల్లాల్లోనే కాదు ఫిలిప్పీన్స్ దేశంలో కూడా కోడిపందాలు జోరుగానే జరుగుతాయి.కాగా కరోనా వైరస్ కారణంగా ఫిలిప్పీన్స్ లో కోడిపందాలపై నిషేధం విధించారు. కానీ అదేమీ లెక్క చేయకుండా ఫిలిప్పీన్స్ లోని ఉత్తర సమర్ ప్రాంతంలో స్థానికులతో పాటు ఆ చుట్టు పక్కల ప్రాంతాలవారు జోరుగా కోడిపందాలు ఆడుతున్నారు.
దీనిపై సమాచారం అందుకున్న స్థానిక శాన్ జోస్ మున్సిపల్ పోలీస్ స్టేషన్ లో ఆఫీసర్ ఇన్ చార్జిగా పనిచేస్తున్న క్రిస్టియన్ బోలోక్ తన సిబ్బందితో కోడిపందాలు జరిగే ప్రాతానికి వెళ్లారు. అనంతరం పందాలు నిర్వహిస్తున్న ముగ్గుర్ని అరెస్ట్ చేశారు. పందేలు నిర్వహిస్తరనేదారికి ఆధారంగా రెండు కోడిపుంజులను కూడా అదుపులోకి తీసుకున్నారు.
కోడిపుంజులను అదుపులోకి తీసుకునే క్రమంలో పోలీసు అధికారి బోలోక్ ఆ కోడిపుంజులలో ఒకదానిని చేతుల్లోకి తీసుకునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో ఆకోడిపుంజు కాలికి కట్టి ఉన్న పదునైన కత్తి ఆ పోలీసు అధికారి ఎడమ తొడభాగం సర్రున కోసుకుపోయింది. దీంతో తొడలోని రక్తనాళాన్ని సర్రున కోసేసింది. అనుకోకుండా జరిగిన ఈ ప్రమాదంలో తీవ్ర రక్తస్త్రావం కావడంతో పోలీసు అధికారి బోలోక్ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన పోలీసు వర్గాలను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఓ అధికారి కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.
ఇది చాలా దురదృష్టకరమైన ఘటన అని 25 సంవత్సరాలు ఎక్స్ పీరియన్స్ కలిగిన అధికారిని కోల్పోయామని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. కాగా..కత్తి కట్టిన కోడిపుంజును బరిలో వదిలితే అది సాగించే పోరాటం అంతాఇంతా కాదు. ఒక్కోసారి కోడిపుంజుకు కట్టే కత్తి పదునుకు వ్యక్తులు కూడా గాయపడుతుంటారు. అంత షార్పుగా ఉంటుంది కోడికత్తి. అలా కోడిపందాలను అదుపు చేసే క్రమంలో ప్రమాదవశాత్తు జరిగిన ఘటనలో పోలీసు అధికారి క్రిస్టియన్ బోలోక్ కోడిపుంజు కత్తికి బలయ్యారు.