నాలుగు పిల్లలకు జన్మనిచ్చిన గోల్డెన్ టైగర్.. పులికూనల వీడియో వైరల్

  • Published By: nagamani ,Published On : November 3, 2020 / 03:59 PM IST
నాలుగు పిల్లలకు జన్మనిచ్చిన గోల్డెన్ టైగర్.. పులికూనల వీడియో వైరల్

Updated On : November 3, 2020 / 4:10 PM IST

china four golden tiger cubs : అరుదైన గోల్డెన్ టైగర్ నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది. చైనాలోని తూర్పు జెజియాంగ్ ప్రావిన్స్ లోని తైహు లేక్ లాంగెమోంట్ ప్యారడైజ్ జూలో అక్టోబర్19న గోల్డెన్ టైగర్ ప్రసవించింది. ఈ పిల్లలు జూలో తెగ సందడి చేసేస్తున్నాయి. 12 రోజుల వయసున్న మూడు ఆడ, ఒక మగ పులి పిల్లలు జూలో సందడి చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.


చైనా ప్రభుత్వానికి చెందిన అధికారిక మీడియా సంస్థ ఈ వివరాలను ట్విట్టర్లో పోస్ట్ చేసింది. గోల్డెన్ టైగర్ చర్మంపై చారలు నలుపు రంగులో కాకుండా లేత బంగారు, ఎరుపు గోధుమ రంగులో చూడముచ్చటగా ఉంటాయి. జన్యువుల్లో మార్పుల వల్ల పులి చర్మంపై చారల రంగులు మారతాయని శాస్త్రజ్ఞులు తెలిపారు.



https://10tv.in/chinese-women-cleaner-drinks-water-from-a-toilet-she-brushed-to-prove-to-her-bosses-she-does-her-job-well/
ప్రపంచ వ్యాప్తంగా కేవలం 30 మాత్రమే ఉన్న గోల్డెన్ టైగర్లు..
ఒక ప్రత్యేకమైన జాతికి చెందిన గోల్డెన్ టైగర్లు అరుదుగా కనిపిస్తాయి. జెయింట్ పాండాలకంటే కూడా గోల్డెన్ టైగర్ కు అత్యంత అరుదైన జాతిగా పేరుంది. వీటి చర్మంపై వెంట్రుకలు, చారలు ఎరుపు-గోధుమ రంగుల్లో ఉంటాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కేవలం 30 మాత్రమే గోల్డెన్ టైగర్ జాతి పులులు ఉన్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇది మొత్తం జెయింట్ పాండాల సంఖ్య కంటే 62 రెట్లు తక్కువ. అంతే ఇవి ఎంత అరుదైనవో అర్థం చేసుకోవచ్చు.


పుట్టగానే పులి పిల్లలను తల్లి నుంచి వేరుచేశామని జూ అధికారులు చెబుతున్నారు. వాటి తల్లి మొదటిసారిగా ప్రసవించడంతో పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టామని..వాటిని సంరక్షించటానికి ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. బెంగాల్ టైగర్ జాతి పులల జన్యు పరివర్తన (జెనెటిక్ మ్యుటేషన్) ద్వారా కొత్త రకం గోల్డెన్ టైగర్ జాతి పులులను సృష్టించినట్టు జూ అధికారులు వెల్లడించారు. వీటిల్లో సంతానోత్పత్తి రేటు చాలా తక్కువగా ఉంటుంది.దీంతో పుట్టిన పిల్లలను బహు జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే వీటి సంఖ్య అంతకంతకూ తగ్గిపోయే ప్రమాదముంది. దీంతో జూ అధికారులు ఈ గోల్డెన్ టైగర్ పిల్లలను అత్యంత జాగ్రత్తగా పరిరక్షిస్తున్నారు.


భారత్ లో ఒకే ఒక్క గోల్డెన్ టైగర్..
మన దేశంలోని కజిరంగ నేషనల్ పార్క్ లో ఒక గోల్డెన్ టైగర్ ను అధికారులు గత జులై గుర్తించారు. ఇది ప్రస్తుతం భారతదేశంలో సజీవంగా ఉన్న ఒకే ఒక్క గోల్డెన్ టైగర్ కావడం విశేషం.