ట్రంప్ 2.0.. భారత్‌తో అమెరికా సత్సంబంధాలపై ఎలాంటి ప్రభావం పడుతుందో తెలుసా?

అప్పట్లో వారిద్దరు కలిసి హౌడీ మోదీ, నమస్తే ట్రంప్‌ వంటి భారీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

ట్రంప్ 2.0.. భారత్‌తో అమెరికా సత్సంబంధాలపై ఎలాంటి ప్రభావం పడుతుందో తెలుసా?

Updated On : November 6, 2024 / 12:30 PM IST

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ గెలుపు దిశగా పయనిస్తున్నారు. దీంతో ఆయన రెండోసారి అమెరికా అధ్యక్షుడు అయ్యే అవకాశాలు ఉండడంతో అది భారత్‌-అమెరికా సంబంధాలపై ఎలా ప్రభావం చూపుతుందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ట్రంప్ మొదటి నుంచి అమెరికా ఫస్ట్ అనే విధానాన్నే పాటిస్తానని చెబుతున్నారు. అమెరికా విదేశాంగ విధానాన్ని పునరుద్ధరించాలని భావిస్తున్నట్లు ఇప్పటికే స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ మొదటిసారి బాధ్యతలు నిర్వహించిన సమయంలో భారత ప్రధాని ప్రధాని మోదీతో ఆయన మంచి స్నేహాన్ని కొనసాగించారు.

వారిద్దరు కలిసి హౌడీ మోదీ, నమస్తే ట్రంప్‌ వంటి భారీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆ సమయంలో ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు మరింత బలపడ్డాయి. అమెరికాకు భారత్‌ ప్రధాన వ్యూహాత్మక భాగస్వామిగా ఉంది. ఇప్పుడు ట్రంప్‌ రెండోసారి అధ్యక్షుడైతే ఇరు దేశాల మధ్య వాణిజ్యం, వలసలు, మిలటరీ సహకారం, దౌత్యం వంటి ప్రధాన అంశాల్లో సత్సంబంధాలు మరింత బలపడడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే, ఆయా రంగాల్లో కొన్ని సవాళ్లు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది.

వాణిజ్యం, వలసలు, రక్షణ రంగంలో ఇలా..
ట్రంప్ విదేశాంగ విధాన విధానం స్పష్టంగా ఉంటుంది. అమెరికా ప్రయోజనాలకు ట్రంప్ ప్రాధాన్యం ఇవ్వడం, అంతర్జాతీయ ఒప్పందాలలో అమెరికాకు ఎదురయ్యే చిక్కులను తగ్గించడం వంటివాటిపై ఆయన మొగ్గుచూపుతారు. ట్రంప్ తొలిసారి అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన సమయంలో పారిస్ వాతావరణ ఒప్పందం, ఇరాన్ అణు ఒప్పందంతో సహా కీలక అంతర్జాతీయ ఒప్పందాల నుంచి అమెరికా నిష్క్రమించేలా చేశారు.

ట్రంప్ ఇప్పుడు అధ్యక్షుడు అయినా ఇటువంటి విధానాలతోనే ముందుకు వెళ్లవచ్చు. దీంతో ఇటువంటి విధానలు భారత్ సహా ఇతర దేశాలకు కాస్త విసుగు తెప్పించవచ్చు. తాను ఎన్నికైతే పరస్పర పన్ను విధానాన్ని తీసుకొస్తానని ట్రంప్ ఇప్పటికే చెప్పారు. విదేశీ ఉత్పత్తులపై భారీగా పన్ను విధిస్తానన్నారు.

ఇక ఇమ్మిగ్రేషన్ విషయానికి వస్తే గతంలో ట్రంప్ పాలనలో ముఖ్యంగా హెచ్‌1 బీ వీసా ప్రోగ్రామ్‌పై నిర్బంధ వైఖరిని ఆయన అవలంభించారు. దీంతో అది భారతీయ నిపుణులపై ప్రభావం చూపింది. భారతీయ ఐటీ నిపుణులు, సాంకేతిక సంస్థలకు అది సవాళ్లను సృష్టించింది. అటువంటి విధానాలు మళ్లీ ప్రవేశపెడితే అమెరికాలోని భారతీయులను ప్రభావితం చేయవచ్చు. అలాగే, నైపుణ్యం కలిగిన భారతీయ కార్మికులపై ఆధారపడే అమెరికా సాంకేతిక సంస్థలు కూడా కాస్త ఇబ్బందిపడవచ్చు.

మిలటరీ సంబంధాల విషయానికి వస్తే.. కొన్ని ఏళ్లుగా భారత్-అమెరికా మధ్య సంబంధాలు బలపడడంలో రక్షణ, సైనిక సహకారం కీలక పాత్ర పోషిస్తోంది. జో బైడెన్ హయాంలో ఇరు దేశాల మధ్య పలు రక్షణ ఒప్పందాలు జరిగాయి. ట్రంప్ వచ్చినా కూడా ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనా ప్రభావాన్ని ఎదుర్కోవాలనే ఇరు దేశాల లక్ష్యాలు భారత్-అమెరికా సైనిక సహకారాన్ని పెంపొందించే అవకాశం ఉంది.

ముకేశ్‌ అంబానీ, నారాయణ మూర్తి ముఖంతో డీప్‌ఫేక్‌ వీడియోలు.. రూ.95 లక్షలు మోసపోయిన ఇద్దరు వ్యక్తులు