కరోనా భయం…4వ వంతు జనాభాను దిగ్భందించిన ఇటలీ

  • Published By: venkaiahnaidu ,Published On : March 8, 2020 / 11:39 AM IST
కరోనా భయం…4వ వంతు జనాభాను దిగ్భందించిన ఇటలీ

Updated On : March 8, 2020 / 11:39 AM IST

ఇటలీలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. చైనా తర్వాత కరోనా మరణాలు ఎక్కువగా నమోదైన దేశం ఇటలీనే. కరోనా కారణంగా ఇటలీకి వెళ్లే పర్యాటకుల సంఖ్య పూర్తిగా పడిపోయింది. ఇటలీ కూడా కరోనాను కంట్రోల్ చేసేందుకు కఠిన చర్యలు చేపడుతోంది. కరోనా వ్యాప్తిని నిలువరించేందుకు దేశ మొత్తం జనాభాలో నాలుగోవంతు మందిని ఇటలీ లాక్ డౌన్ చేసేసింది. అంటే ఎవ్వరూ పర్మీషన్ లేనిదే గడప దాటి బయట అడుగుపెట్టకూడదన్న మాట.

సీరియస్,అత్యవసర కారణం లేకుండా ఎవ్వరూ కూడా ఏప్రిల్ 3 వరకు, నార్త్ ఇటలీలోని విస్తారమైన ప్రాంతాలలోకి ప్రవేశించడానికి లేదా బయలుదేరడంపై నిషేధం విధించారు. ఇటలీ ఆర్థికరాజధాని మిలాన్,ఫేమస్ టూరిస్ట్ ప్రాంతం వెనీస్ చుట్టుపక్కల ప్రాంతాలతో కూడా కలిపి దేశంలో ఈ దిగ్భంధించించబడిన ప్రాంతాల్లో 1కోటి 50లక్షలకు పైగా ప్రజలు నివసిస్తున్నారు. శనివారం నాటికి ఇటలీలో కరోనా సోకి మరణించిన వారి సంఖ్య 233. ప్రపంచంలో జపాన్ తర్వాత ఎక్కువ వృద్ధ జనాభా ఉన్నది ఇటలీలోనే. ప్రపంచవ్యాప్తంగా కరోనా సోకి మరణించినవారిలో 99శాతం మంది వృద్ధులే ఉన్న విషయం తెలిసిందే.

మరోవైపు ఇటాలియన్ హెల్త్‌ కేర్ వ్యవస్థను పెంచడానికి 20వేల మంది అదనపు సిబ్బందితో ఇటాలియన్ హెల్త్‌ కేర్ వ్యవస్థను పెంచడానికి రిటైర్డ్ డాక్టర్లను నియమించుకుంటున్నారు, అయితే లోంబార్డీ ప్రాంతం హాస్పిటల్స్ లో బెడ్ ల ఇబ్బంది కనబడుతోందని  పౌర రక్షణ అధికారులు చెబుతున్నారు. మరోవైపు భారత్ కూడా ఇటలీ పర్యాటకుల పట్ల అప్రమత్తమయింది. భారత్ లో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికభాగం ఇటలీ నుంచి వచ్చినవారివే. ఇటలీ దేశస్థులకు జారీ చేసిన వీసాలను కూడా కరోనా దృష్ట్యా రద్దు చేసింది భారత ప్రభుత్వం. 

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్(కోవిడ్-19)సోకిన వారి సంఖ్య 1లక్ష దాటినట్లు రెండు రోజుల క్రితం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్(WHO)ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ వైరస్ బారిన పడి ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 3వేల500మంది ప్రాణాలు కోల్పోగా అందులో 3వేల మందికి పైగా చైనాకి చెందినవాళ్లే. చైనా తర్వాత ఇటలీ,ఇరాన్,దక్షిణ కొరియా దేశాల్లో కరోనా ప్రభావం అధికంగా ఉంది. ఇరాన్ లో గడిచిన 24గంటల్లోనే 21కొత్త మరణాలు సంభవించాయంటే అక్కడి పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇరాన్ లో ఇప్పటివరకు 145మంది ఈ వైరస్ సోకి ప్రాణాలు కోల్పోగా 5వేల823మంది వైరస్ సోకి హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్ పొందుతున్నారు.