Russia-Ukraine War: ఇంట్లోనే పెట్రోల్ బాంబులు తయారు చేసి రష్యా సైనికులపై విరుచుకుపడుతున్న యుక్రెయిన్ ప్రజలు
దూసుకొస్తున్న రష్యా సైనికులను ఎలాగైనా అడ్డుకోవాలన్న తపనతో ప్రభుత్వం ఇచ్చిన పిలుపుతో యుక్రెయిన్ ప్రజలు ఇంట్లోనే పెట్రోల్ బాంబులు తయారు చేసి రష్యా సైన్యంపై విరుచుకుపడుతున్నారు.

Russia Ukraine War..‘make Molotov Cocktails’
Russia-Ukraine War..‘Make Molotov Cocktails’: వారి చేతిలో ఆయుధాలు లేవు.. పోరాడటానికి యుద్ధ ట్యాంక్‌లు, ఫైటర్ జెట్లు లేవు… శత్రువును తమ వాకిట్లోకి రానివ్వద్దన్న ఒక్క పంతం తప్ప. ప్రస్తుతం యుక్రెయిన్ వాసుల గుండెలు అగ్ని గుండాల్లా మారుతున్నాయి.. దూసుకొస్తున్న రష్యా సైనికులను ఎలాగైనా అడ్డుకోవాలన్న తపన వారి కళ్లల్లో కనిపిస్తోంది.. అదే వారిని నడిపిస్తోంది.. కదనరంగంలోకి దూకి పోరాడాలన్న స్ఫూర్తిని రగిలిస్తోంది. కానీ పూర్తి సన్నద్ధంగా ఉన్న శత్రువును అడ్డుకోవడం ఎలా? మెషిన్ గన్, యుద్ధ ట్యాంకుల నుంచి క్షిపణుల వరకు సర్వసన్నద్ధంగా శత్రువును నిలువరించడం ఎలా? దీనికి యుక్రెయిన్ వాసులు చెబుతున్న సమాధానం మోలటోవ్ మాక్‌టేల్. ఇదేదే కిక్ ఇచ్చే కాక్‌టెయిల్ కాదు.. ప్రాణాలు తీసే మాక్‌టెయిల్.
శత్రువు మన వాకిట్లోకి వచ్చాడు.. తస్మాత్ జాగ్రత్త అంటూ యుక్రెయిన్ రక్షణశాఖ ఇప్పటికే ఓ ప్రకటనను వెలువరించింది. శత్రువు కంట పడితే బుద్ధి చెప్పడానికి మోలటోవ్ మాక్‌టెయిల్ ఉపయోగించండి అంటూ సూచించింది. కానీ అప్పటికే వీటిని సిద్ధం చేసుకున్నారు యుక్రెయిన్ వాసులు. మోలటోవ్ మాక్‌టెయిల్ అంటే హోమ్ మేడ్ పెట్రోల్ బాంబు లాంటిది. అలర్లు జరిగినప్పుడు ఉపయోగించే వీటిని ఇప్పుడు రష్యా సైన్యంపై వాడండి అంటూ ప్రజలకు సూచించింది యుక్రెయిన్ రక్షణశాఖ. ఇంకేముంది ప్రభుత్వ ఆజ్ఞలను తూచా తప్పకుండా పాటిస్తున్నారు యుక్రెయిన్ పౌరులు. ఇళ్లలో దాచిన పెట్రోల్, పాతసీసాలను బయటకు తీశారు. పెట్రో బాంబులను సిద్ధం చేశారు. ఆ బాంబులతోనే రష్యన్లకు స్వాగతం పలుకుతున్నారు.
Also read : Russia-Ukraine War: చంకలో చంటిబిడ్డలు..కన్నీటితో యుక్రెయిన్ ను వీడుతున్న తల్లులు
అప్పటికే రష్యా సైన్యంపై కసితో రగిలిపోతున్న యుక్రెయిన్ వాసులకు ప్రభుత్వ సూచన ఓ ఆజ్యంలా పనిచేసిందనే చెప్పాలి. క్యాన్ల నిండా పెట్రోల్ తీసుకొచ్చి మాక్‌టెయిల్‌ను సిద్ధం చేసుకున్నారు. మాక్‌టెయిల్‌ను ఎలా తయారు చేయాలన్న వీడియోలు కూడా ఇప్పుడు యుక్రెయిన్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో క్యాన్ల నిండా పెట్రోల్ తీసుకొచ్చి ఎవరింట్లో వారు వందలాది బాటిళ్లల్లో ఈ చిన్నపాటి ఆయుధాలను రెడీ చేసి పెట్టుకున్నారు. రష్యా యుద్ధ ట్యాంకో, సైనిక వాహనమో కనపడితే చాలు.. వాటిపై మాక్‌టెయిల్ వర్షం కురిపిస్తున్నారు యుక్రెయిన్ వాసులు. రష్యా దండయాత్ర కీవ్ నగర సరిహద్దుల వరకు ఒక లెక్క.. నగరంలోపల మరోలెక్క అన్నట్టుగా తయారైంది పరిస్థితి.
Also read : Indian Students : యుక్రెయిన్ నుంచి మొదలైన భారతీయుల తరలింపు.. ఈ రాత్రికి ముంబైకి చేరుకోనున్న విమానం
ప్రజలు చేసే ఈ దాడులతో రష్యా సైన్యం వేగం తగ్గుతోంది. ఎప్పుడు ఏ అపార్ట్‌మెంట్ నుంచి ఏ మాక్‌టెయిల్ బాంబు దూసుకొస్తుందో అని టెన్షన్ పడుతున్నారు. మరోవైపు ఆయుధాలు ధరించిన ఉక్రెయిన్ పౌరులు ఇప్పుడు కీవ్ నగరంలో గస్తీ కాస్తూ కనిపిస్తున్నారు. తమ దేశాన్ని రక్షించుకోవడం తమ బాధ్యతని.. ఇలా యుద్ధం చేయడం తమకు ఏమాత్రం ఇష్టం లేదని.. కానీ రష్యానే తమకు ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చిందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు ఆయుధాలతో యువత, ఆయుధాలు లేని వారి చేతుల్లో మాక్‌టెయిల్ మొత్తంగా చూస్తే రష్యన్లకు చుక్కలు కనిపిస్తున్నాయి.