Abdul Rauf Azhar: ఆపరేషన్ సిందూర్‌లో మసూద్ అజార్ సోదరుడు, కాందహార్ ప్లేన్ హైజాక్ మాస్టర్ మైండ్ ఖతం..
ఈ రెండు ఉగ్రవాద సంస్థలు అనేక సంవత్సరాలుగా భారత్ పై ఉగ్రదాడులు చేస్తున్నాయి. ఎంతోమందిని బలితీసుకున్నాయి.

Abdul Rauf Azhar: పహల్గాం ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకున్న సంగతి తెలిసిందే. పాకిస్తాన్ లో ఉగ్రవాద స్థావరాలపై భారత్ మెరుపు దాడులు చేసింది. క్షిపణుల వర్షం కురిపించింది. ఈ దాడిలో ఉగ్రవాదుల శిబిరాలు నేలమట్టం అయ్యాయి. పెద్ద సంఖ్యలో మావోయిస్టులు హతమయ్యారు. ఇక ఆపరేషన్ సిందూర్ లో మసూద్ అజార్ సోదరుడు, జైష్ ఉగ్రవాది, కాందహార్ ప్లేన్ హైజాక్ (IC 814 విమాన హైజాక్) మాస్టర్ మైండ్ అబ్దుల్ రవూఫ్ అజార్ హతమయ్యాడు.
పాకిస్తాన్ పంజాబ్ ఫ్రావిన్స్‌లో భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌లో జైష్-ఎ-మొహమ్మద్ ఆపరేషనల్ హెడ్, IC-814 విమాన హైజాకింగ్ సూత్రధారి అబ్దుల్ రవూఫ్ అజార్‌ను భారత్ మట్టుబెట్టిందని అధికారులు తెలిపారు.
భారత సాయుధ దళాలు పంజాబ్ ప్రావిన్స్‌లోని బహవల్‌పూర్, మురిద్కేలపై దాడులు నిర్వహించాయి. జైష్, లష్కర్ ప్రధాన కార్యాలయాలను ధ్వంసం చేశాయి. ఈ రెండు ఉగ్రవాద సంస్థలు అనేక సంవత్సరాలుగా భారత్ పై ఉగ్రదాడులు చేస్తున్నాయి. ఎంతోమందిని బలితీసుకున్నాయి.
మృతి చెందిన ఉగ్రవాదుల్లో జైషే-మహ్మద్ ఆపరేషనల్ హెడ్, IC-814 హైజాకింగ్ సూత్రధారి, అంతర్జాతీయ జిహాదీ నెట్‌వర్క్‌లలో కేంద్ర వ్యక్తి అయిన అబ్దుల్ రవూఫ్ అజార్ కూడా ఉన్నాడని అధికారులు తెలిపారు.
అబ్దుల్ రవూఫ్ అజార్ ఐక్యరాజ్యసమితి ప్రకటించిన ఉగ్రవాది మసూద్ అజార్ సోదరుడు. భారత జరిపిన బహావల్పూర్ దాడుల్లో మసూద్ అజార్ కుటుంబ సభ్యులు 10 మంది మరణించారని, వారిలో అతని సోదరి, బావమరిది కూడా ఉన్నారని నిన్న అధికార వర్గాలు తెలిపాయి. జైషే ఉగ్రవాదిని హతమార్చినట్లు ధృవీకరిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు.
అబ్దుల్ రవూఫ్ అజార్.. 1999 డిసెంబర్ లో జరిగిన ఇండియన్ ఎయిర్‌లైన్స్ IC-814 హైజాక్ కుట్ర సూత్రధారి. ఖాట్మండ్ నుండి ఢిల్లీకి వస్తున్న విమానాన్ని హర్కత్ వుల్ ముజాహిదీన్ కు చెందిన ఐదుగురు ఉగ్రవాదులు హైజాక్ చేశారు. వారిలో రవూఫ్ ఒకడు. దాన్ని తాలిబాన్ ఆధీనంలోని ఆఫ్ఘానిస్తాన్ కు తరలించారు. ఆ సమయంలో 176 మంది ప్రయాణికుల ప్రాణాలకు ముప్పు ఏర్పడగా, మసూద్ అజార్‌ను విడుదల చేయాల్సి వచ్చింది.
అలా విడుదలైన తర్వాత మసూద్ అజార్ జె.ఇ.ఎమ్‌ను స్థాపించాడు. ఆ తర్వాత అది భారత గడ్డపై అనేక ఉగ్ర దాడులను నిర్వహించింది. వాటిలో 2001 పార్లమెంటు దాడి, 2016 పార్లమెంటు దాడి ఉన్నాయి. 2001 దాడి తర్వాత పాకిస్తాన్‌లో నిషేధం విధించబడినప్పటికీ, జైష్ కార్యకలాపాలు కొనసాగిస్తోంది.
అబ్దుల్ రవూఫ్ అజార్ పేరు అల్ ఖైదా ఉగ్ర నెట్‌వర్క్‌లతోనూ అనుసంధానమై ఉంది. 2002లో అమెరికన్ జర్నలిస్ట్ డేనియల్ పెర్ల్ కిడ్నాప్, హత్యకు అతడు ప్రేరణగా పని చేశాడని ఆధారాలు ఉన్నాయి. ఈ ఘటనతో ప్రపంచం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఒక్కటై భారత దేశానికి మద్దతుగా నిలబడింది.