నా బిడ్డను నా భర్త పుట్టినప్పటి నుంచి ముట్టుకోలేదు: మనసులను కదిలిస్తున్న డాక్టర్ భార్య భావోద్వేగ ట్వీట్

  • Published By: vamsi ,Published On : March 19, 2020 / 12:08 AM IST
నా బిడ్డను నా భర్త పుట్టినప్పటి నుంచి ముట్టుకోలేదు: మనసులను కదిలిస్తున్న డాక్టర్ భార్య భావోద్వేగ ట్వీట్

Updated On : March 19, 2020 / 12:08 AM IST

ప్రమాదం అని తెలిస్తే అటువైపు వెళ్లడానికి కూడా ఆలోచిస్తాం.. అయితే ప్రమాదం అని తెలిసినా కూడా తప్పించుకోలేని బాధ్యత వారిది. వారు భయపడితే ప్రాణాంతక వైరస్ చేతిలో ఎందరో బలకాక తప్పదు. వాళ్లు కష్టపడకపోతే.. రోజురోజుకు కేసులు పెరిగిపోతాయి. వాళ్లు ఎవరో కాదు.. రాత్రనక పగలనగ కష్టపడి కరోనాపై పోరాటం చేస్తున్న డాక్టర్లు.

తుమ్మినా.. దగ్గినా సొంత వాళ్లను సైతం దూరంగా పెట్టే  పరిస్థితులు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. ఎన్నెన్నో హృదయ విదారక దృశ్యాలు, కథనాలకు కేంద్ర బిందువుగా కరోనాకు చికిత్స చేస్తున్న డాక్టర్లు, నర్సుల పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఓవైపు మహమ్మారిని తరిమికొట్టేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తూనే.. తమకు సోకకుండా చేసుకునేందుకు వాళ్లు ఎంతగానో కష్టపడాలి.

రోజురోజుకూ పెరుగుతున్న  కరోనా వైరస్‌ బాధితులకు చికిత్సలు చేసిన వైద్యులను సైతం మహమ్మారి విడిచిపెట్టట్లేదు. వైరస్‌ బాధితులతో పాటు వైద్యులు కూడా స్వీయ నిర్బంధంలో ఉంటూనే వైద్య సేవలు అందిస్తున్నారు. ఈమేరకు ఓ డాక్టర్ భార్య ఈ వైరస్‌ తమ జీవితాలను మార్చేసిన విధానాన్ని ట్విటర్లో పంచుకోగా.. ఆ ట్వీట్లు ఇప్పుడు మనసులను కదిలిస్తున్నాయి.

See Also| రోనా ఎఫెక్ట్ : సోనమ్‌కు స్క్రీనింగ్ చేయలేదు – షాహిద్ జిమ్ తెరిపించాడు..

అమెరికాకు చెందిన రాచెల్‌ పాట్జెర్‌ భర్త ఫిజీషియన్‌గా పనిచేస్తున్నారు. వీరికి ఇద్దరు సంతానం. అయితే రెండు వారాల క్రితం మరో శిశువుకు జన్మనిచ్చింది రాచెల్. అయితే, ఆ బిడ్డను తన భర్త కనీసం ముట్టుకోలేదు. ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. ‘నా భర్త ఫిజీషియన్‌. మాకు ముగ్గురు పిల్లలు. ఆయన ప్రస్తుతం కరోనా బాధితులకు వైద్య సేవలు అందిస్తున్నారు. ఆయన నుంచి ఇతరులకూ వైరస్‌ సోకుతుందనే కారణంతో ఆయనను మా నుంచి దూరంగా ఉంచేందుకు గ్యారేజ్‌కు పంపించాం. ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న వాళ్లు ఇలాంటి త్యాగాలు చేయక తప్పదు. సమాజం కోసం మేము ఓ కఠిన నిర్ణయం తీసుకున్నాం.’ అని ఆమె తన ట్విట్టర్‌లో రాశారు. 

అంతేకాదు నా భర్త లాంటి ఎంతో మంది వైద్యులు, నర్సులు కుటుంబాలకు దూరంగా ఉంటూ సేవలు అందిస్తున్నారు. దయచేసి అందరూ అప్రమత్తంగా ఉండండి. అంటువ్యాధి ప్రబలకుండా జాగ్రత్తపడండి. మీ సేవలో నిమగ్నమైన వైద్య సిబ్బందికి ధన్యవాదాలు తెలపండి’’అంటూ రాచెల్ ప్రజలకు ట్విటర్‌ వేదికగా విజ్ఞప్తి చేశారు.